Rangamarthanda: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కలల సినిమా ‘రంగమార్తాండ’ ఎట్టకేలకు విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు సినిమా బృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వివిధ కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తోంది. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాని రాజశేఖర్, అనసూయ వంటి భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు మంచి ఆదరణ దక్కించుకున్నాయి.
ఇటీవల చిత్ర బృందం ప్రీమియర్స్ కూడా వేసింది. ఇది చూసిన వారు ‘కృష్ణవంశీ ఈజ్ బ్యాక్’, ‘ నటీనటుల అభినయం వేరే లెవెల్ లో ఉంది’, ‘సినిమా చూసిన ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండరు’ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇది మన అమ్మానాన్నల కథ అంటూ ఇప్పటికే కృష్ణవంశీ పలుసార్లు ప్రస్తావించారు. తాజాగా ఈ చిత్రం థియేటర్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దక్కించుకుంది.
మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రంగస్థల కళాకారుల జీవితాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది.