క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం రంగమార్తాండ ఉగాది సందర్భంగా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది ఇందులో భాగంగా చిత్ర బృందం వరుసగా ప్రమోషన్లలో పాల్గొంటుంది. సీనియర్ నటి రమ్యకృష్ణ ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సందర్భంగా ఆమె ఒక మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..
‘రంగమార్తాండ’ సినిమాలో మీరు చాలా అద్భుతంగా కనిపించారు.
రమ్య: ఆర్టిస్టులు ఎవ్వరైనా ప్రతి సినిమాలోని అద్భుతంగా కనిపించాలనే కోరుకుంటారు. నా వరకు వస్తే ఇప్పటివరకు నేను చేసిన చిత్రాలు వేరు.. ఇప్పుడు వేరు. ఈ మాట చాలామంది చెప్పడం మీరు వినే ఉంటారు. కానీ నాకు మాత్రం మనస్ఫూర్తిగా ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నేను నటించాననో, నా భర్త సినిమా తీసాడనో నేను ఈ మాట చెప్పడం లేదు. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇదే చెప్తారు.
ఈ చిత్రం గురించి చెప్పగానే మీరు ఎలా ఫీలయ్యారు?
రమ్య: మరాఠి లో ‘నట సామ్రాట్’ చూసిన తర్వాత కృష్ణవంశీ గారు ఎలాగైనా ఆ చిత్రాన్ని తెలుగులోకి తీసుకురావాలని పట్టు పట్టారు. నాతో చెప్పినప్పుడు ఈ రోజుల్లో ఇలాంటి చిత్రాలు ఎవరు చూస్తారని అడిగాను. ఆయన ఎంత మొండివారో మీ అందరికీ తెలిసిందే. చాలా పట్టుదలతో దీన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఆయన కష్టానికి ప్రతిఫలం ఉంటుందని ఆశిస్తున్నాను.
మీ పాత్ర ఎంపిక గురించి చెప్పండి.
రమ్య: కృష్ణవంశీ సినిమా పనులు మొదలు పెట్టినప్పటి నుంచి నాతో ఒక మాట చెప్పేవారు. మంచి ఇల్లాలిగా, తల్లిగా కళ్ళతోనే నటించే ఆర్టిస్ట్ కావాలి అని. ఇందుకోసం ఆయన ఎంతగానో వెతికారు. నేనే నటిస్తానని సరదాగా చెప్పాను ఆయన అది సీరియస్ గా తీసుకొని నన్నే ఫైనల్ చేశారు( నవ్వుతూ). షూటింగ్ చేసేటప్పుడు ఇది మీ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమా అవుతుందని ఆయనతో చెప్పాను. ఇందులో నా పాత్ర నా మనసుకి చాలా దగ్గర అయింది.
ఇందులో మీ నటన చూసి కోస్టార్స్ కూడా ఆశ్చర్యపోయారని బయట టాక్.
రమ్య: ఇందులో నా పాత్ర చిత్రీకరణ అలాంటిది. కట్టు, బొట్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. కాస్ట్యూమ్స్ అన్ని నేనే దగ్గర ఉండి చూసుకున్నా. మా నాన్న ఓ రోజు ఫోన్ చేసి మా అమ్మ గుర్తొచ్చింది’ అంటూ ఎమోషనల్ అయ్యారు. నా పాత్ర చాలా తక్కువ మాట్లాడాలి. కళ్ళతోనే హవ భావాలు పలికించాలి. నీలాంబరి, శివగామి పాత్రల్ని మరిపించేలా ఇందులో నా పాత్ర ఉంటుంది.
మీ భర్త డైరెక్షన్లో పనిచేయడం ఎలా అనిపించింది?
రమ్య: ‘చంద్రలేఖ’ తర్వాత ఆయన నాతో పని చేయకూడదని నిర్ణయించుకున్నారు. అప్పటినుంచి మేమిద్దరం కలిసి పని చేసింది లేదు.’ రంగమార్తాండ’ తోనే తిరిగి అది సాధ్యమైంది. ఎమోషనల్ సీన్స్ లో నేను ఏడ్చిన ప్రతిసారి ఆయన కళ్ళల్లోనూ నీళ్లు తిరిగేవి. ఆయనతో పని చేయడం విందు భోజనం లాంటిది.
మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి?
రమ్య: మన శరీరానికి ఏం కావాలో మనకు మాత్రమే తెలుస్తుంది. అవసరమైనంత ఆహారం మాత్రమే తీసుకోవాలి. రాత్రిపూట ద్రవాహారం తీసుకోవడం, సరిపడినంత వ్యాయామం చేయడం నా అలవాట్లు.
బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ వంటి దిగ్గజాలతో నటించడం మీకు ఎలా అనిపించింది?
రమ్య: వాళ్ళిద్దరితో నటించడం మర్చిపోలేని అనుభూతి. ఎందుకంటే బ్రహ్మానందం ఇలాంటి పాత్ర ఎప్పుడు చేయలేదు. ఈ సినిమాలో ఆయన పాత్ర ఇంతవరకు ఆయన సృష్టించుకున్న ఇమేజ్ కి పూర్తి భిన్నమైంది. ఇందులో ఆయన తన నటనతో అందరిని ఏడిపించేస్తారు. విషయానికొస్తే ఇద్దరం పోటీపడి నటించే వాళ్ళం. శివాత్మిక రాజశేఖర్ ఎంతో అనుభవమున్న నటిలా అద్భుతంగా నటించింది. సీనియర్ నటుల మధ్య ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించేది. ఆ స్థాయికి రావడానికి నాకు ఎంతో సమయం పట్టింది. శివాత్మిక మాత్రం చిన్న వయసులోనే దాన్ని ఒంట బట్టించుకుంది. భవిష్యత్తులో తన గొప్ప నటి అవుతుంది
కృష్ణవంశీ ఇది మన అమ్మానాన్నల కథ అంటూ మొదటి నుంచి చెప్తున్నారు కారణం!.
రమ్య: ‘రంగమార్తాండ’ కేవలం అమ్మానాన్నల కథ మాత్రమే కాదు. మన ఇంటి కథ. ప్రతి ఇంటి కథ. ఈ సినిమాలో వచ్చే ప్రతి సన్నివేశం నిజ జీవితంలో ఏదో ఒక కుటుంబంలో జరిగే ఉంటుంది. అలాంటి అనుభవాలని ఒక దగ్గరికి చేర్చి తీసిందే ఈ సినిమా. ప్రేక్షకుల మనసుతో పాటు ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంటుందని ఆశిస్తున్నాను.