Ram Charan: ప్రతి హీరో కెరీర్లో ప్రేమకథల సినిమాలు ఉంటాయి. గ్లోబల్ స్టార్ హోదాలో ఉన్న రామ్ చరణ్ కూడా ప్రేమకథలో నటించారు. కానీ, ఆ సినిమా క్లాసిక్ అయింది. అది కూడా రిలీజైనప్పుడు ఫ్లాప్ అయిన సినిమా 14ఏళ్ల తర్వాత రీ-రిలీజ్ అయినప్పుడు, 15ఏళ్లకు రీ-రీ-రిలీజైనప్పుడు. ఇలాంటి రేర్ ఫీట్ మరే హీరోకి, సినిమాకీ సాధ్యం కాలేదు. రామ్ చరణ్ ఆ మ్యాజిక్ ‘ఆరెంజ్’ సినిమాతో చేసి చూపించారు. ‘మగధీర’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నాగబాబు 2010లో నిర్మించిన సినిమా విడుదలైనప్పుడు ఫ్లాప్ మూవీ. ‘ప్రేమ ఎక్కువ కాలం ఉండదు.. పెళ్లి తర్వాత అసలుండద’ని నమ్మే ఓ మోడర్న్ కుర్రాడి లవ్ స్టోరీ ‘ఆరెంజ్’.
జీవితంలో ఎంతోమంది అమ్మాయిల్ని కలిసినా ప్రేమ విషయంలో తన అభిప్రాయం చెప్పగానే విడిపోతూంటారు. తను మాత్రం నమ్మిన సిద్ధాంతాన్నే ఫాలో అవుతాడు. ఈక్రమంలో పరిచయమైన ఓ అమ్మాయి ప్రేమ విషయంలో ఎలా ఒప్పించిందో క్లైమాక్స్. ఈ సినిమా 2010లో విడుదలైనప్పుడు ప్రేక్షకులు, అభిమానులు, ట్రేడ్ మాత్రమే కాదు నాటి యువతను కూడా ఆకట్టుకోలేదు. రామ్ చరణ్ అల్ట్రా మోడర్న్ లుక్, రిచ్ మేకింగ్, కథలో ఇంటెన్సిటీ, మంచి ఫీల్ ఉన్న లవ్ ఆల్బమ్.. ఏవీ ఆదుకోలేదు. ప్రస్తుత రీ-రిలీజ్ ట్రెండ్ లో 2024లో తొలిసారి రీ-రిలీజ్ చేస్తే తెలుగు ప్రేక్షకులే కాదు, ట్రేడ్ సైతం విస్తుపోయేలా ‘ఆరెంజ్’ భారీ బ్లాక్ బస్టర్ అయింది. మూవీకి మెయిన్ ఎస్సెట్ హారిస్ జైరాజ్ సంగీతం. ఆయన స్వరపరచిన పాటల మ్యాజిక్ 15ఏళ్లుగా సంగీత సాగరంలో ఓలలాడిస్తూనే ఉంది.
ఏ ధియేటర్ చూసినా యూత్ హవా. ధియేటర్లన్నీ కాలేజీ క్యాంపస్ అయిపోయాయి. పాటలు వస్తే యూత్ పాడుతూ మ్యూజిక్ కు డ్యాన్స్ చేస్తూ.. ధియేటర్లలోనే ప్రేమికులు ప్రపోజ్ చేసుకుంటున్నారు. రీ-రిలీజ్ లో ఏకంగా 4కోట్లు వసూలు చేయడమంటే ఆషామాషీ కాదు. ఇక్కడ మరో విశేషం.. ఈఏడాది రీ-రీ-రిలీజ్ చేస్తే మళ్లీ అదే ఆదరణ. చూస్తే.. ప్రతి ఏడాది ఫిబ్రవరి 14 వ్యాలెంటైన్స్ డే స్పెషల్ మూవీగా ‘ఆరెంజ్’ నిలిచిపోతుందని చెప్పొచ్చు. విడుదలైన 14ఏళ్లకు బ్లాక్ బస్టరైన చరిత్ర ‘ఆరెంజ్’కు మాత్రమే సొంతం. ఇన్నాళ్లూ రామ్ చరణ్ కెరీర్లో ‘ఆరెంజ్’ ఫ్లాప్ వెంచర్. కానీ.. రీ-రీ-రిలీజ్ లతో సినిమా సాధించిన విజయాలతో ఇప్పుడది బ్లాక్ బస్టర్. లవ్ క్లాసిక్. భాస్కర్ చెప్పినట్టు సూర్యోదయం, సంధ్యా సమయాల్లో ఆకాశంలో వచ్చే మ్యాజిక్ అవర్ సినిమా టైటిల్ అని. సినిమా కూడా అలాంటి మ్యాజిక్ అవరే..!