Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టయిలింగ్ రేంజ్ ఏంటో ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ చూపించింది. మ్యాగజైన్ కోసం రెండు నెలల క్రితం హాంకాంగ్ లో రామ్ చరణ్ తన పర్ఫెక్ట్ లుక్స్, ఫిజిక్ తో ఫొటోషూట్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈక్రమంలో కవర్ పేజీ స్టోరీ కోసం రామ్ చరణ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తన వ్యక్తిగత, సినీ జీవిత విశేషాలు పంచుకున్నారు.
అయ్యప్పదీక్ష.. 17ఏళ్ల వయసులో నాన్న నాకు అయ్యప్ప దీక్ష తీసుకోవడం అలవాటు చేశారు. ఆ దీక్ష నాలో ఎంతో క్రమశిక్షణ తీసుకొచ్చింది. నా ఆలోచనలు, మనసు నియంత్రణలో ఉంచుకోవడానికి ఎంతో దోహదపడింది. అనవసర విషయాలకు దూరంగా ఉంటూ మానసికంగా ప్రశాంతంగా ఉంటాను. హాంకాంగ్ లో ఫొటోషూట్ కోసం లగ్జరీ హోటల్లో చెప్పుల్లేకుండా నడుస్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూశారు.
సినీ కెరీర్.. ఆర్ఆర్ఆర్ తో ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చింది. నాపై మరింత బాధ్యత పెంచింది. దానిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం సినిమాలను మాత్రమే కాదు.. మన సంస్కృతి, సంప్రదాయాలను కూడా చూపిస్తున్నామనే నిజాయితీతో ఉంటున్నా.
కుటుంబం.. పిల్లలు నా ప్రపంచం. షూటింగ్ అయిపోయాక ఇంటికొస్తే వారితోనే నా కాలక్షేపం. వాళ్లెంత అల్లరి చేసినా చూస్తూ ఆస్వాదిస్తా. కారాను వాళ్లమ్మ ఏమైనా అంటే నాదగ్గరకు వస్తుంది. తండ్రి అయ్యాక జీవితం పూర్తిగా మారిపోయింది. పెంపుడు రైమ్ కూడా నాకెంతో ఉల్లాసాన్నిస్తుంది. కారాను చాలా జాగ్రత్తగా చూస్తుంది. స్విమ్మింగ్ పూల్ దగ్గరకు కారా వెళ్తే లాగేస్తుంది.
‘పెద్ది ‘ కోసం కఠోరశ్రమ.. ప్రస్తుతం నేను నటిస్తున్న పెద్ది కోసం చాలా కష్టపడుతున్నా. పాత్రలో ఇమిడిపోయేందుకు దాదాపు ఏడాదిన్నరగా శిక్షణ తీసుకుంటున్నా. సుల్తాన్, దంగల్ సినిమాలకు పనిచేసిన కోచ్ దగ్గరే కుస్తీ నేర్చుకుంటున్నా. ఆయన చాలా స్ట్రిక్ట్. ఓదశలో.. గురూజీ, నేను కుస్తీలో నేషనల్స్ కు ప్రాక్టీస్ చేయట్లేదని చెప్పానని (నవ్వుతూ) అన్నారు.
వారసత్వం.. తండ్రి చిరంజీవి నుంచి వారసత్వంతోపాటు కష్టపడేతత్వాన్నీ అలవర్చుకున్నా. అందరూ 50 గంటలు కష్టపడితే నువ్వు 100 గంటలు కష్టపడు అని నాన్న చెప్పారు. అదే ఆయన్నుంచి నేను నేర్చుకున్న సూత్రమని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.



