Ram Charan: అవకాశం వస్తే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటిస్తానని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలిపారు. తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో నటించాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టారు. ఇలాంటి కథ కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ఇటీవల చెప్పడంతో చెర్రీ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ‘నాటునాటు’ పాటకు ఇటీవల ఆస్కార్ వరించిన విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అమెరికా నుంచి నేరుగా చెర్రీ.. ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఢిల్లీలో ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విరాట్ బయోపిక్ గురించి మాట్లాడారు. లుక్స్ పరంగా ఆ సినిమాకు తాను సరిపోతానని అభిప్రాయపడ్డారు. వెండితెరపై కోహ్లీ పాత్ర పోషించే అవకాశం రావాలని కోరుకుంటున్నానని అన్నారు. భారత క్రికెట్ రంగంలో ‘రికార్డుల రారాజు’ గా కోహ్లీ తన మార్కు చూపిస్తున్నాడు. తాజాగా కోహ్లీ బయోపిక్ పై చెర్రీ చేసిన వ్యాఖ్యలు అటు సినీ ప్రియుల్లోను, అటు క్రికెట్ అభిమానుల్లోను రంగంలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
చరణ్ ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘సీఈవో’, ‘సర్కారోడు’ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈనెల 27న చెర్రీ పుట్టినరోజుని పురస్కరించుకొని ఈ సినిమా టైటిల్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.