Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా తెరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే ఆయనకు ధీటైన వారసుడిగా అటు ఫ్యామిలీ, ఇటు సినిమాల్లోనూ పేరు తెచ్చుకున్నారు రామ్ చరణ్. తొలి సినిమా ‘చిరుత’లోనే నటనలో ఏమాత్రం బెరుకు లేకుండా డ్యాన్స్, ఫైట్స్, కామెడీ, సెంటిమెంట్ సీన్లల్లో తనదైన నటన ప్రదర్శించి తనకంటూ ఓ మార్గం ఉండబోతోందని గట్టిగానే సంకేతమిచ్చారు. ‘చిరుత’ చూసిన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం.. 100 సినిమాల్లో నటించిన హీరో ఎక్స్ పీరియన్స్ రామ్ చరణ్ లో కనిపించిందని చెప్పడం గమనార్హం. రెండో సినిమా ‘మగధీర’ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు రామ్ చరణ్.
దక్షిణ భారతదేశంలోనే తొలి 100కోట్ల షేర్ సాధించిన తొలి సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది ‘మగధీర’. పాన్ ఇండియా క్రేజ్ లేని సమయంలో ఒక్క తెలుగులోనే విడుదలై ఇక్కడే ఆస్థాయి కలెక్షన్లు రాబట్టడం దక్షిణ భారతీయ సినీ పరిశ్రమనే కాదు.. యావత్ భారతీయ సినీ పరిశ్రమనే ఆశ్చర్యానికి గురి చేసింది. సినిమా రిలీజైన 5వారాల తర్వాత హైదరాబాద్ లో 35ధియేటర్లు పెంచారంటే ‘మగధీర’ ఏస్థాయిలో ప్రభంజనం సృష్టించిందో అర్ధం చేసుకోవచ్చు. రామ్ చరణ్ హార్స్ రైడింగ్ స్కిల్స్, యాక్షన్, డ్యాన్స్, రాజమౌళి టేకింగ్ వెరసి ఆ సినిమా అప్పటికి 79ఏళ్ల తెలుగు సినిమాలో ఓ రికార్డు. రామ్ చరణ్ కే కాదు, తెలుగు సినిమా పొటెన్షియాలిటీ స్టేటస్ పెంచిన సినిమా ‘మగధీర’.
అప్పటికి చిరంజీవి ‘అంజి’ మాత్రమే 25కోట్ల భారీ బడ్జెట్ సినిమా. కానీ.. మగధీరకు 40కోట్లకు పైగా ఖర్చు చేసి ట్రిపుల్ మార్జిన్ లాభాలు రాబట్టింది. నాటి నుంచే తెలుగులో 40 నుంచి నేడు 300కోట్లకు పైగా ఖర్చు చేసే స్థాయికి తెలుగు సినిమా పెరిగింది. మగధీరను ఆనాడే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని.. ఆ సినిమాకు అంత రేంజ్ ఉందని భావించానని దర్శకుడు రాజమౌళి ఇటివల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మగధీర తర్వాత రామ్ చరణ్ క్రేజ్ ఎంతో ఎత్తుకి వెళ్లింది. అప్పటికి రాజకీయాల్లో ఉన్న చిరంజీవిని తెరపై చూసే అవకాశం లేక నిరాశలో ఉన్న అభిమానులకు రామ్ చరణ్ వరంలా మారారు. రామ్ చరణ్ కూ సొంతంగా ఫ్యాన్స్ పెరిగి ఇంతై.. ఇంతింతై అనే స్థాయికి ఎదిగారు.