చిరంజీవి కొడుకు హీరో అవ్వడం తేలికే కానీ రామ్ చరణ్ అవ్వడం చాలా కష్టం. అదేంటి అనుకోవచ్చు. స్టార్ కొడుకు స్టార్ అవ్వడంలో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎలాగు ఫ్యాన్స్ భుజాన మోసేస్తారు కానీ ఆ ఫ్యాన్ బేస్ ని మోస్తూ, ఆ అంచనాలకు తగినట్టుగా సినిమాలు తీయడం, ఆ లెగసీని కొనసాగించడంలోనే అసలు సినిమా ఉంటుంది.
చిరు తనయుడిగా కేవలం సక్సెస్ ఫుల్ హీరోగానే కాదు ఆయన మంచితనం.. స్పూర్తిదాయకమైన విధానాలను కూడా చరణ్ పాటిస్తున్నాడు. అందుకే రామ్ చరణ్ అంటే మెగా ఫ్యాన్స్ కి అంత ఇష్టం. అంతేకాదు సినిమాలు చేయడం స్టార్ ఇమేజ్ సంపాదించడం ఒక ఎత్తైతే దాన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా చూపించాలి.. ఎక్కడ చూపించకూడదు అని తెలిసిన స్టార్ చరణ్.
ప్రొఫెషనల్ గా చెప్పుకుంటే చిరుత నుంచి రంగస్థలం ముందు వరకు రామ్ చరణ్ ఒక స్టార్ అనిపించుకున్నాడు కానీ రంగస్థలంతో పరిపూర్ణ నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.
రంగస్థలంలో చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే.. చెవితనం ఉన్న అమాయక వ్యక్తి పాత్ర.. తన వారి కోసం ఎంతటి వారినైనా ఎదురించే సాహసం.. అసలు చిట్టిబాబు పాత్ర రామ్ చరణ్ కోసమే పుట్టిందా అనేలా చరణ్ జీవించేశాడు. అందుకే ఆ సినిమా చూశాక అప్పటివరకు చరణ్ ని విమర్శించిన నోళ్లన్నీ మూతపడ్డాయి. అందుకే రామ్ చరణ్ కెరీర్ రంగస్థలం ముందు ఆ తర్వాత అనేస్తున్నారు.
ఇక ఆ తర్వాత RRR లో రామరాజు పాత్రలో చరణ్ అదరగొట్టేశాడు. రాజమౌళిని సైతం ఆశ్చర్యపరచేలా రామ్ చరణ్ నటన ఉందంటే ఆయన కమిట్మెంట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
తండ్రి చూపించిన బాటలో నడుస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఏర్పరచుకుని చేస్తున్న ప్రతి సినిమా కమిటెడ్ గా తనవరకు ది బెస్ట్ ఇస్తూ వస్తున్నాడు రామ్ చరణ్. అదే ఆయన్ను చిరు తనయుడు మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా నిలబెట్టింది.