Ram Charan Birthday special: రామ్ చరణ్.. టాలీవుడ్ మాత్రమే కాదు.. అమెరికాలో సైతం ఈ పేరు మారుమోగుతోంది. ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయస్థాయిలో తెలుగు వాడి సత్తా చాటిన ఆర్ఆర్ఆర్ సినిమాతో విశ్వవ్యాప్తం అయ్యాడు రామ్ చరణ్. ఆస్కార్ వేడుకల్లో రామ్ చరణ్ సందడి అమెరికన్లను ఆకట్టుకుంది. రామ్ చరణ్ ఆహార్యం, క్రమశిక్షణ, నిబద్దత, ప్రతి ఇంటర్వ్యూలో చిత్ర బృందానికి ఇచ్చిన గౌరవం తన స్థాయిని పెంచాయి. ఇదంతా ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. చిన్నప్పటి నుంచీ క్రమశిక్షణ, పెంపకం, పెరిగిన వాతావరణం రామ్ చరణ్ ను ప్రతిబింబిస్తున్నాయి. అశేష సంఖ్యలో అభిమానగణాన్ని సంపాదించి పెట్టాయి. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా తండ్రి పేరు నిలబెడుతున్న రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 27న. అభిమానులకు ఇది చరణ్ వారోత్సవం.
గుర్రపుస్వారీ, డ్యాన్స్..
చిరంజీవికి హార్స్ రైడింగ్ లో దిట్ట. అదే చరణ్ కు నేర్పించారు. చిన్న వయసులోనే గుర్రపుస్వారీ నేర్చుకున్నాడు. గుర్రాన్ని అదుపు చేయడం.. గుర్రం వేగాన్ని ఒడిసిపట్టడం రామ్ చరణ్ అలవోకగా చేస్తాడని బాబాయి పవన్ కల్యాణ్ సైతం కొనియాడారు. ఆయన గుర్రపు స్వారీ స్కిల్స్ ను మగధీరలో పూర్తిస్థాయిలో వాడుకున్నారు దర్శకుడు రాజమౌళి. ఇక డ్యాన్సుల విషయంలో కూడా అంతే. తానే ఓ డ్యాన్సింగ్ డైనమైట్ అయినప్పుడు తనయుడు కూడా డ్యాన్సింగ్ సెన్సేషన్ కావాలని కోరుకుంటాడు తండ్రి. రామ్ చరణ్ అదే చేసి చూపించాడు. చిన్నప్పుడు ఇంట్లో స్టెప్పులు వేస్తుంటే చిరంజీవి మురిపెం చూశాం. ఇప్పుడా మురిపాన్ని తండ్రికి టన్నుల్లో ఇస్తున్నాడు చరణ్. ఎంతో ఒద్దికగా కనిపించే రామ్ చరణ్ అల్లరిలో కూడా ముందే.
వ్యక్తిత్వం ఉన్నతం..
స్నేహితుడు, నటుడు రానాతో కలిసి చదువుకోవడం.. అల్లరి చేయడం.. వారి మాటల్లోనే కాదు చిరంజీవి మాటల్లో కూడా విన్నాం. ఓసారి చిరంజీవిని.. రామ్ చరణ్ కు ఇంట్లో ఎవరిలా అనిపిస్తాడు అనే ప్రశ్నకు.. ఇంకెవరు బాబాయి పవన్ కల్యాణ్ తత్వమే అన్నారు. తక్కువగా మాట్లాడటం, ఎక్కువగా వినడం.. ఇవన్నీ పవన్ ను స్ఫురిస్తాయి. ఇక చారిటీ, ఎదుటివారిపై ప్రేమ, కుటుంబానికి ఇచ్చే విలువ ఇవన్నీ తండ్రి చిరంజీవి నుంచి వచ్చినవే. నటుడిగా చరణ్ కు అభిమానులు ఎక్కువ. వ్యక్తిత్వంతో కూడా చరణ్ తనను తాను చూపుతూ తన కుటుంబానికి ప్రేక్షకుల్లో ఉన్న ప్రేమను రెట్టింపు చేస్తున్నాడు. అభిమానులకు రామ్ చరణ్ విజయమే తమ విజయం.. ఆయన ఆనందమే తమ ఆనందం.