‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో 2024లో భారీ విజయాన్ని అందుకుని అనేక అవార్డులు, ప్రశంసలు సొంతం చేసుకున్న నిహారిక కొణిదెల ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘రాకాస’. మానస శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ మూవీని ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఆదివారం విడుదలైన ‘రాకాస’ టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి స్పందన అందుకుంది. ఫోక్ లోర్ హారర్, పురాతన ఆచారాలు, అతీంద్రియ అంశాలు, కామెడీ మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం థియేటర్ అనుభూతిని కొత్త స్థాయికి తీసుకెళ్తుందని టీమ్ చెబుతోంది. టీజర్‌లో కనిపించిన విజువల్స్, ఫోర్ట్ బ్యాక్‌డ్రాప్, మిస్టీరియస్ వాతావరణం, డెమానిక్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.
టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన నిర్మాత నిహారిక కొణిదెల, ‘రాకాస’తో నెక్ట్స్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేశామని తెలిపారు. థియేటర్‌కు వచ్చిన ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో ఈ సినిమాను నిర్మించామని, ప్రేక్షకులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచమని స్పష్టం చేశారు. కథ, విజువల్స్, టెక్నికల్ వాల్యూస్ అన్నింటిలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని చెప్పారు.
దర్శకురాలు మానస శర్మ ఈ చిత్రాన్ని ప్రత్యేకమైన మైథాలజికల్ టచ్‌తో రూపొందించారని, కథలో ఉన్న భావోద్వేగం, సస్పెన్స్, వినోదం అన్నీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని టీమ్ వెల్లడించింది. సంగీత్ శోభన్ ఈ చిత్రంలో కొత్త కోణంలో కనిపించనున్నారని, నయన్ సారిక పాత్ర కూడా కథలో కీలకంగా ఉంటుందని తెలిపారు.
సినిమాకు అనుదీప్ దేవ్ సంగీతం అందించగా, రాజు ఎడురోలు సినిమాటోగ్రఫీ, అన్వర్ అలీ ఎడిటింగ్ నిర్వహించారు. భారీ స్థాయిలో నిర్మితమైన ఈ చిత్రం దేశీయంగా మాత్రమే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా విస్తృతంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్‌లకు మంచి వ్యూస్ రావడం చిత్రంపై ఉన్న ఆసక్తిని మరింత పెంచింది.
మొత్తానికి ‘రాకాస’ హారర్, ఫాంటసీ, కామెడీ మేళవింపుతో థియేటర్లలో ప్రత్యేకమైన అనుభూతి అందించేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 3న విడుదల కాబోయే ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా అన్న ఆసక్తి ఇప్పుడు సినీ వర్గాల్లో నెలకొంది.
