‘సకుటుంబానాం’ ట్రైలర్ లాంచ్ వేడుకలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ మరోసారి నోరు జారుతూ వివాదాల్లో చిక్కుకున్నారు. ఇటీవలి కాలంలో ఆయన పబ్లిక్ ఈవెంట్స్‌లో మాట్లాడే తీరు పలువురు విమర్శలకు గురవుతుంటే, ఈసారి కామెడి బ్రహ్మ బ్రహ్మానందం ముందే చేసిన మాటలతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ట్రైలర్ ఈవెంట్ స్టేజ్‌పై బ్రహ్మానందాన్ని ఉద్దేశించి “ముసలి ముండా కొడకా” అని పలికిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ క్షణంలో బ్రహ్మానందం అసౌకర్యంగా ఉన్నట్టు కనిపించినందుకు మరింత ప్రతికూల స్పందన వస్తోంది.
గతంలో ‘రాబిన్ హుడ్’ ఈవెంట్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, తర్వాత దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలో అలీపై అనవసర వ్యాఖ్యలు చేయడం—ఇవన్నీ ఇంకా మర్చిపోకముందే, కొత్తగా బ్రహ్మానందం ముందు ఈ మాటలతో రాజేంద్రప్రసాద్ మళ్లీ విమర్శల కేంద్రబిందువయ్యారు.
తాను చెప్పిన మాటలకు సమర్థన చెప్పడం ఆయనకు కొత్త కాదు కానీ, వరుసగా ఇలా నోరు జారడం ఆయన ఇమేజ్‌ను దెబ్బతీస్తోందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
‘సకుటుంబానాం’ చిత్రంలో రాజేంద్రప్రసాద్–బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించారు. కానీ ఈ వేడుకలో జరిగిన ఈ ఘటన సినిమా గురించి పక్కనబెట్టి వేరే దిశలో దృష్టిని మళ్లించింది.
ఇప్పటికే సోషల్ మీడియాలో “ఇలా మాట్లాడటం సీనియర్ నటుడికి తగదు”, “ప్రతి ఈవెంట్‌లో ఇలాంటి వ్యాఖ్యలతో ఎందుకు సమస్యలు తెచ్చుకుంటున్నారు?” అంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజేంద్రప్రసాద్ ఈసారి కూడా ఈ విషయాన్ని సమర్థించుకుంటారా? లేక స్పందిస్తారా? అనేది చూడాలి. అయితే వేదికపై, ముఖ్యంగా సహనటుల ఎదుట, ఇలా మాట్లాడటం ఆయన వయసు, అనుభవం, ప్రతిష్టకు సరిపోదని అభిమానులు గుర్తు చేస్తున్నారు.
