యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్ గరుడవేగతో సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లుగా అనిపించినా కల్కి చిత్రంతో మళ్లీ పాత దారే పట్టాడు. కల్కి తర్వాత ఆయన కొత్త సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. అసలు ఆయన సినిమాలు చేయబోతున్నాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌లో సెటిల్ అవ్వడం మంచిదంటూ కొందరు సలహా ఇస్తున్న సమయంలో రాజశేఖర్ సినిమా విడుదలకు రెడీ అయ్యిందంటూ ఒక అధికారిక ప్రకటన వచ్చింది.
ఉన్నట్లుండి రాజశేఖర్ సినిమా విడుదల ఏంటా అంటూ అంతా ఆశ్చర్య పోతున్నారు. అయితే రాజశేఖర్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది కొత్త సినిమాతో కాదు చాలా పాత సినిమాతో.. అవును చాలా కాలం క్రితం అర్జున అనే చిత్రంలో రాజశేఖర్ నటించాడు. ఆ సినిమా ఏవో కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
విడుదల తేదీలను గతంలో చాలా సార్లు ప్రకటించారు. దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలుగా అదుగో ఇదుగో అంటూ సినిమా విడుదలను దాట వేస్తూ వస్తున్నారు. ఈసారి విడుదల చేయడం ఖాయంగా అనిపిస్తుంది. ఈ సినిమాపై ఏమాత్రం అంచనాలు లేని కారణంగా సినిమాను సొంతంగా విడుదల చేసేందుకు నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నాడు. కన్మణి దర్శకత్వంలో రూపొందిన అర్జునలో రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రి, కొడుకు పాత్రల్లో రాజశేఖర్ కనిపించబోతున్నాడు. ఇక హీరోయిన్‌గా మరియం జకారియా నటించింది.