దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రాబోయే రెండు రోజుల్లో మరింతగా విస్తరించి దక్షిణ బంగాళాఖాతంతోపాటు అండమాన్ సముద్రం, దీవులు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ప్రస్తుతం ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర తమిళనాడు, విదర్భ, మధ్య కర్ణాటక మీదుగా దాదాపు కిలోమీటర్ ఎత్తులో ఉత్తర, దక్షిణ ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కోస్తా, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని.. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని తెలిపింది. దీంతో ప్రస్తుత ఎండలు, ఉక్కపోతల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించనుంది.
ప్రస్తుత రుతుపవనాలతో అండమాన్ నికోబార్ దీవుల్లో వర్షాలు పడుతున్నాయని ఐఎండీ తెలిపింది. రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకు 15నే చేరుకుంటాయని మొదట్లో అంచనా వేసినా ఒకరోజు ఆలస్యంగా చేరుకున్నాయి.