వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం పై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే జగన్ పై అనర్హత వేటు వేసి పులివెందులకు ఉప ఎన్నికలు తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. 60 రోజులపాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే చట్ట ప్రకారం అనర్హత వేటు పడుతుందని తెలిపారు. ముందస్తుగా స్పీకర్ అనుమతి తీసుకున్న వారికి ఎందుకు మినహాయింపు ఉంటుందని చెప్పారు. ఎటువంటి సమాచారం లేకుండా సమావేశాలకు హాజరు కాని వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం పై మాజీ సీఎం జగన్ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించిన విషయం తెలిసిందే. కూటమి తర్వాత ఎక్కువ అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నది తామే కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నది జగన్ వాదన. అయితే ఆ హోదా సంపాదించడానికి 18 సీట్లు అవసరం. ఈ నిబంధన ప్రకారం వైసీపీ కి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. తమకు ఆ హోదా ఇచ్చేంతవరకు అసెంబ్లీలోకి అడుగుపెట్టేదే లేదని జగన్ గతంలో ప్రకటించారు.
ఆయనతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీకి హాజరు కావడం లేదు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన డిప్యూటీ స్పీకర్.. అనర్హత వేటు అంశాన్ని ప్రస్తావించారు. మరోవైపు ఇటీవలే జగన్ లండన్ పర్యటన నుంచి ఏపీ కి చేరుకున్న విషయం తెలిసిందే. ఇకపై ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటూ అసెంబ్లీ సమావేశాల్లో తన గొంతుక వినిపిస్తారని వైసీపీ చెబుతోంది. అయితే, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే పార్టీ ఎమ్మెల్యేలు అందరిపై అనర్హత వేటు పడుతుంది. కాబట్టి ఈ విషయంపై దేశవ్యాప్తంగా చర్చించుకోవడాన్ని జగన్ కోరుకుంటున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.