రాజకీయ నాయకులకు కేసులు కొత్త కాదు. నిజానికి, సాధారణ కేసులతో పోల్చితే, సీబీఐ – ఈడీ లాంటి అత్యున్నత విచారణ సంస్థలు ఆయా కేసుల్ని విచారిస్తే, ఆయా నాయకుల రేంజ్ అమాంతం పెరిగిపోతుంటుంది. జైలుకు వెళ్ళడం రాజకీయ నాయకులకు అదనపు క్వాలిఫికేషన్ అవుతోన్న రోజులివి. ‘ఓ సారి జైలుకి వెళ్ళొచ్చెయ్.. ముఖ్యమంత్రి పదవి దక్కుతుంది..’ అంటూ ఓ పత్రికాధినేత ఇటీవల, రాజకీయాల్లో తలపడిపోయిన ఓ రాజకీయ ప్రముఖుడికి ఉచిత సలహా పారేశారంటే.. రాజకీయాలు ఏ స్థాయిలో దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు.
అసలు విషయంలోకి వచ్చేద్దాం. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని, వ్యాపార కార్యకలాపాలకు కాకుండా ఇతర మార్గాల్లోకి నిధులు మళ్ళించారని చెన్నయ్‌లోని ఓ బ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. గతంలోనూ రఘురామకృష్ణరాజుపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. సీబీఐ కేసు అనగానే.. రఘురామకృష్ణరాజు ఉలిక్కిపడ్డారు. ఉలిక్కిపడ్డారా.? ఉలిక్కిపడినట్లు నటించారా.? అన్నది వేరే చర్చ.
సీబీఐ కేసు నమోదు చేయడం వెనుక కుట్ర దాగి వుందని రఘురామ ఆరోపిస్తున్నారు. వైసీపీకి చెందిన ఓ ఎంపీ, సదరు బ్యాంకు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారనీ, ఫోన్ కాల్ డేటా తీస్తే వాస్తవాలు బయటకు వస్తాయనీ రఘురామ సెలవిచ్చారు. సీబీఐ కేసు నమోదు చేసిందంటే, లెక్కలు తేలతాయ్.. కాస్త సమయం పట్టొచ్చు అంతే.
సరే, సీబీఐ విచారణలు ఇటీవలి కాలంలో ఎలా జరుగుతున్నాయి.? అన్నది వేరే చర్చ. చాలా కేసులున్నాయి సీబీఐకి.. విచారణ చేయడానికి. కొత్తగా ఇంకో కేసు.. అంతే తేడా. ‘మా ముఖ్యమంత్రిగారి మీద చాలా కేసులున్నాయి.. వాటి విచారణ జరుగుతోంది.. అలాంటప్పుడు, మా పార్టీ వాళ్ళు నన్ను విమర్శించడమేంటి.?’ అని రఘురామ ఎద్దేవా చేసేశారు. ఇలా తగలడింది రాజకీయం. రాజకీయ నాయకుల కామెంట్లు విని జనం కామెడీ చేసేసుకుంటున్నారు.. ఆ రాజకీయ నాయకులే తిరిగి ప్రజల్ని కామెడీ చేస్తున్నారనుకోండి.. అది వేరే సంగతి.