జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మార్మోగుతోంది. మొన్నటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ కూడా పవన్ ను ప్రశంసించారు. “ఆయనో తుఫాన్” అంటూ మోడీ అభివర్ణించారు. దీంతో ఆయన పేరు బాలీవుడ్ లోనూ బాగా వినిపిస్తోంది.
రీసెంట్ గా ప్రముఖ రియాలిటీ షో “కౌన్ బనేగా కరోడ్ పతి” లో పవన్ పై కంటెస్టెంట్ కి ప్రశ్న ఎదురయింది. ప్రస్తుతం ఈ షో 16 వ సీజన్ జరుగుతోంది. అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ లో కంటెస్టెంట్ ని పవన్ గురించి ప్రశ్న అడిగారు. ” 2024 జూన్ లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న వ్యక్తి ఎవరు?” అని బిగ్ బి కంటెస్టెంట్ ని ప్రశ్నించారు. ఈ క్వశ్చన్ కు కంటెస్టెంట్ ఆడియన్స్ పోల్ తీసుకున్నారు. ఇందులో 50% మందికి పైగా పవన్ కళ్యాణ్ అని బదులిచ్చారు. దీంతో ఆ కంటెస్టెంట్ పవన్ పేరు చెప్పి ఆన్సర్ లాక్ చేశారు. అది కరెక్ట్ ఆన్సర్ కావడంతో రూ 1.60 లక్షలు గెలుచుకుని తర్వాత స్టేజ్ కి వెళ్లారు.
పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన పూర్తి చేయాల్సిన “ఓజీ”, “హరిహర వీరమల్లు”, “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాలకు సంబంధించి పోస్టర్లు, టీజర్లు సందడి చేస్తున్నాయి. త్వరలోనే ఆయన ఈ సినిమాలకు సంబంధించి షూటింగ్ మొదలుపెట్టనున్నారు.