మూడేండ్లుగా ఊరిస్తున్న పుష్ప-2 ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ, ఎన్నో అడ్డంకులను దాటుకుని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా పుష్ప-1కు సీక్వెల్ గా వస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్-రష్మిక హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ తో నిర్మించింది. పార్టు-1 భారీ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. మరి అంచనాలను నిలబెట్టుకుందా లేదా అనేది ఇందులో తెలుసుకుందాం.
కథ..
ఇది పార్టు-1కు కొనసాగింపుగా ఉంటుంది. పుష్పరాజ్(అల్లు అర్జున్) ఎర్ర చందనం సిండికేట్ లో డాన్ గా ఎదిగిన తర్వాత శ్రీవల్లి(రష్మిక మందన్నా)ను పెళ్లి చేసుకుంటాడు. అప్పటి నుంచి శ్రీవల్లి మాట కోసం ఎంత దూరమైనా వెళ్తుంటాడు. మరోవైపు పార్టు-1లో తన కుటుంబం నుంచి అవమానాలు పడ్డాడు కదా.. రెండో పార్టులో తన కుటుంబం నుంచి గుర్తింపు కోసం ఎంతగానో తపిస్తుంటాడు. ఆ టైమ్ లోనే శ్రీవల్లికి ఇచ్చిన మాట కోసం పుష్పరాజ్ ఎంత వరకు వెళ్లాడు, ఎలాంటి సవాళ్లను ఎదుర్కుని రాజకీయాలు చేశాడు అనేది ఇందులో కనిపిస్తుంది. అలాగే పుష్పరాజ్ ను పట్టుకోవడం కోసం భన్వర్ సింగ్ షెకావత్(ఫహాద్ ఫాజిల్) ఏం చేస్తాడు, మంగళం శ్రీను రివేంజ్ స్టోరీ ఎలా ఉంటుంది, పుష్పరాజ్ తన అన్న మోహన్(అజయ్) ఇంటి పేరును తెచ్చుకోగలిగాడా ఇవన్నీ సాధించే క్రమంలో పుష్పరాజ్ జర్నీ ఎలా సాగింది అనేది మనకు ఈ పార్టు-2లో కనిపిస్తుంది. దాన్ని థియేటర్లలో చూడాల్సిందే.
ఎలా ఉందంటే..?
భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఫుల్ ప్యాకెడ్ మాస్ ఎలిమెంట్స్ తో ఉంది. అంచనాలకు తగ్గట్టు గానే యాక్షన్ సీన్లు ఇందులో బోలెడు ఉన్నాయి. సుకుమార్ క్రియేటివ్ డైరెక్షన్ కు బన్నీ నట విశ్వరూపం తోడైనట్టు ఇందులో కనిపిస్తుంది. ఇందులో బన్నీ ఎలివేషన్ సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇక జాతర ఎపిసోడ్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇందులో బన్నీ యాక్షన్ సీన్లు నభూతో నభవిష్యత్ అన్నట్టుగానే ఉంటాయి. ఇందులో ఒక రకంగా బన్నీ నట విశ్వరూపం చూపించాడనే చెప్పుకోవాలి. శ్రీవల్లి మీద తీసిన సీన్లు కూడా చాలా బాగుంటాయి. అయితే ఫస్ట్ హాఫ్ లో పర్వాలేదు అన్నట్టుగానే కథనం సాగుతుంది. సెకండ్ హాఫ్ లో హై సీన్స్ చాలా బాగున్నాయి. ఇందులో ఎక్కవ స్క్రీన్ ప్రెజెన్స్ బన్నీ చుట్టూ సాగుతుంది. బన్నీ తర్వాత ఫహాద్ ఫాజిట్ గురించే చెప్పుకోవాలి.
చాలా సీన్లలో అతని వెర్సటాలిటీ యాక్టింగ్ చూపించాడు. పుష్పరాజ్ ను ఎలాగైనా పట్టుకోవడానికి అతను చేసే ప్రయత్నాలు, బన్నీ ఎత్తుగడలు మనకు సెకండ్ హాప్ లో జాలీగా అనిపిస్తాయి. కొత్తరకం స్మగ్లింగ్ ఐడియాలు అందరికీ వావ్ అనిపిస్తాయి. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషన్ సీన్లను కూడా సమానంగా బ్యాలెన్స్ చేశాడు సుకుమార్. ఐటమ్ సాంగ్ లో కనిపించిన శ్రీలీల ఫుల్ సాంగ్ లో దుమ్ము లేపేసింది. ఇద్దరి డ్యాన్స్ వావ్ అనేలా ఉంటుంది. అయితే పుష్పరాజ్ క్యారెక్టర్ ను డిజైన్ చేసినంత పవర్ ఫుల్ గా విలన్ క్యారెక్టర్ ను డిజైన్ చేయలేదు.
ఒక హీరో బలంగా కనిపించాలంటే అందుకు సరిసమానంగా విలనిజం ఉండాల్సిందే. అప్పుడే మూవీ రక్తి కడుతుంది. ఈ విషయంలో కొంత అసంతృప్తి అనిపిస్తుంది. బన్నీ పాత్రకు హైప్ తేవడానికి సీన్లు రాసుకున్నట్టు అనిపిస్తుంది తప్ప.. ఒక బలమైన విలనిజం మనకు ఎక్కడా కనిపించదు. పవర్ ఫుల్ విలన్ గా ఫహాద్ ఫాజిల్ కనిపిస్తాడేమో అనుకుంటే.. అతని పాత్ర రాను రాను కామెడీగా మారిపోతుంది. ఇది ప్రేక్షకులకు అంతగా నచ్చదు. అయితే క్లైమాక్స్ లో ముగింపు కూడా పర్వాలేదు అన్నట్టుగానే సాగింది.
టెక్నికల్ గా ఎలా ఉందంటే..?
సుకుమార్ మార్క్ డైరెక్షన్ కు ఇదో ఉదాహరణగా నిలుస్తుంది. అతని డైరెక్షన్ లెవల్స్ వేరేగా ఉన్నాయి. క్రియేటివ్ నెస్ ఇందులో బాగానే చూపించాడు. దానికి తోడు ఈ సారి ఎలివేషన్ సీన్లు కూడా మరో లెవల్ లో తీశాడు. అందుకు తగ్గట్టే మైత్రీ నిర్మాతలు కూడా భారీగానే ఖర్చు చేశారు. ఆ రిచ్ నెస్ మనకు ప్రతిసీన్ లో కనిపిస్తుంది. ఇక దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగానే ఉంది. బయట కంటే థియేటర్లలో వింటే ఆ సౌండ్ ఇంకా బాగుంది. ఎడిటింగ్ లోపాలు అక్కడక్కడా కనిపిస్తాయి. చాలా సీన్లకు కత్తెర వేయాల్సింది.
ప్లస్ పాయింట్లు
అల్లు అర్జున్ నటన
యాక్షన్ ఎపిసోడ్స్
ఎమోషనల్ సీన్లు
శ్రీలీల, రష్మిక అందాలు
మైనస్ పాయింట్లు
బలమైన విలనిజం లేకపోవడం
చాలా సీన్లు ల్యాగ్ అనిపించడం
చివరగా..
సినిమాను ఓవరాల్ గా చూస్తే మాస్ జాతర అనే చెప్పుకోవాలి. అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది. మధ్యమధ్యలో ఏదో అంసతృప్తి వెంటాడినా.. వాటిని బన్నీ తన నటనతో కవర్ చేస్తాడు. మొత్తానికి యాక్షన్, ఎమోషన్, బన్నీ నటన, ఎలివేషన్లు.. ఇవన్నీ ప్రేక్షకులను థియేటర్లలో విజిల్స్ వేయిస్తాయి.
తెలుగు బులెటిన్.కామ్ రేటింగ్: 3/5