Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పుష్ప 1 హిట్ తో సీక్వెల్ కు భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో పుష్ప 2ను ఏకంగా 12వేల స్క్రీన్స్ లో సినిమా ప్రదర్శించనున్నారు. నేటి రాత్రి 9.30 నుంచి దేశవ్యాప్తంగా ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. అయితే..
కర్ణాటకలో పుష్ప 2కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బెంగళూరు మహానగరంలో ప్రీమియర్ షోలు ప్రదర్శించేందుకు వీలులేదంటూ బెంగళూరు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రీమియర్స్ ప్రదర్శించే ధియేటర్లు షోను రద్దు చేశాయి. ప్రీమియర్ షోలకు టికెట్స్ బుక్ చేసుకున్న వారికి డబ్బులు వాపస్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో అక్కడి ప్రేక్షకులకు నిరాశే ఎదురయింది.
కర్ణాటక వ్యాప్తంగా ఏ సినిమాకైనా విడుదల రోజు ఉదయం 6గంటలకు ముందుగా అర్ధరాత్రి ప్రీమియర్ షోలు వేయడం నిషేధం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిని స్థానిక కన్నడ నిర్మాతల సంఘం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.