Pushpa 2: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్-రష్మిక జంటగా తెరకెక్కిన ‘పుష్ప 2: ది రూల్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో అవి రెట్టింపయ్యాయి. జాతర సన్నివేశం, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఈక్రమంలో వచ్చిన కిసిక్ స్పెషల్ సాంగ్.. అల్లు అర్జున్-శ్రీలీల డ్యాన్స్ అలరిస్తోంది. దీనికితోడు అల్లు అర్జున్ పలు రాష్ట్రాలు తిరిగి చేస్తున్న ప్రమోషన్ సినిమాపై హైప్ పెంచుతున్నాయి. దీంతో సినిమా చూసేందుకు తగ్గేదే లే అంటున్నారు అభిమానులు. ఇప్పుడు మరో మాస్ ఐటమ్ ‘పీలింగ్స్..’ పేరుతో వచ్చిన పాట, అల్లు అర్జున్-రష్మిక డ్యాన్స్ మూమెంట్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.
తెలుగు సినిమాల్లో న్యూ ఏజ్ జనరేషన్లో డ్యాన్స్ లో కొత్త అంకానికి తెర తీసిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. 20ఏళ్లకు పైగా కెరీర్లో ప్రతి సినిమాలో కూడా పాటల్లో కొత్త తరహా స్టెప్పులతో అలరించారు. ఆయన కోసమే కొత్త స్టెప్పులు డిజైన్ చేసినట్టు కొరియోగ్రాఫర్లు మంచి స్టెప్స్ వేయించారు. దీంతో డ్యాన్స్ లో కూడా తన బ్రాండ్ చూపించారు అల్లు అర్జున్. పీలింగ్స్ పాటలో కూడా హుషారైన స్టెప్స్ వేసారని చెప్పాలి. పూర్తి పాటలో ధియేటర్లలో మోతెక్కిపోవడం ఖాయమనే టాక్ వస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్-రష్మిక పెయిర్ ఆకట్టుకుంటోంది. తెలుగు ప్రేక్షకులని మాత్రమే కాకుండా యావత్ భారతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని మాస్ గెటప్స్, మూమెంట్స్, స్టెప్స్ డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.
పాటకు వస్తున్న రెస్పాన్స్ చూసి రష్మిక సైతం సంతోషం వ్యక్తం చేశారు. ‘పాట ఇంత అద్భుతంగా రావడానికి కారణం అల్లు అర్జున్, సుకుమార్ కారణం. అన్ని భాషల అభిమానులను అలరించాలనే ఉద్దేశంతో డిజైన్ చేసింది. వారిద్దరు పాటపై పెట్టుకున్న నమ్మకానికి నావంతు సహకారం అందించా. వారిద్దరూ నమ్మినట్టే నేనూ నమ్మాను. ధియేటర్లలో పాట మరింత అలరిస్తుంద’ని సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని చెప్పారు. ఏపీ మినహా దేశవ్యాప్తంగా ‘పుష్ప 2’ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. టికెట్ రేట్లు భారీగా ఉన్నా బుకింగ్స్ బాగుండటం విశేషం. మరో రెండు రోజుల్లో ప్రీమియర్స్ తో విడుదలవుతున్న పుష్ప 2: ది రూల్ మరెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.