ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహజ వనరులు చాలా చాలా ఎక్కువ. సుదీర్ఘ తీర ప్రాంతం రాష్ట్రానికి వరం. ఎలా చూసుకున్నా, ఆంధ్రప్రదేశ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో, ఆంధ్రప్రదేశ్ నష్టపోయిన మాట వాస్తవం. కానీ, అంతకంటే ఎక్కువ నష్టం టీడీపీ, వైసీపీ పాలనతో రాష్ట్రానికి జరిగింది, జరుగుతోందన్నది కఠోర వాస్తవం.
రోజూ రాష్ట్రంలో ఏదో ఒక అలజడి. ఎలాంటి గొడవా లేకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడచిన ఏడున్నరేళ్ళలో ఏనాడైనా వుందా.? సమైక్య ఉద్యమం సంగతి పక్కన పెడితే, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో అంతకు ముందెన్నడూ పెద్దగా అలజడులు లేవు. సమైక్య ఉద్యమంలో కూడా ఎక్కడా రాష్ట్ర ప్రగతికి అడ్డంకి కలిగేలా ఆందోళనలు జరగలేదు.
కానీ, ఇప్పుడెందుకు ఆంధ్రప్రదేశ్ ఇలా తయారైంది.? ఆందోళనాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం ఎందుకు మారుతోంది.? నిత్యం రాష్ట్రంలో ఎందుకీ అలజడులు.? విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు.. రైతులు లబోదిబోమంటున్నారు.. ఉద్యోగులూ తమ జీతాల కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. రాజకీయ అలజడుల సంగతి సరే సరి.
రాజధాని లేని రాష్ట్రం.. అభివృద్ధి లేని రాష్ట్రం.. ఇలా ఆంధ్రప్రదేశ్ ఎన్నో విషయాల్లో తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. అయినాగానీ, ఈ అలజడులు ఎందుకు పుట్టుకొస్తున్నాయి. కొత్తగా ఇప్పుడు జిల్లాల లొల్లి తెరపైకొచ్చింది. రాష్ట్రంలో ఎవరు అధికారంలో వున్నా, అభివృద్ధిపై దృష్టిపెట్టాలి. కానీ, ఆ ప్రయత్నం జరుగుతున్నట్లుగా కనిపించడంలేదు.
అప్పట్లో ఎన్టీయార్ పేరు మీదా, చంద్రన్న పేరు మీదా సంక్షేమ పథకాలు. ఇప్పుడేమో వైఎస్సార్, జగనన్న పేరుతో సంక్షేమ పథకాలు. వెరసి, రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది. కులాల కుంపట్లు, మతాల పేరుతో రాజకీయాలు.. ఆఖరికి రిపబ్లిక్ దినోత్సవం వేళ, గుంటూరు జిన్నా టవర్స్ వేదికగా అలజడి.. ‘వందేమాతరం’ అని నినదిస్తున్నవారి అరెస్ట్.! అసలేం జరుగతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.? రాష్ట్రం పట్ల బాధ్యత ఎవరికీ లేకుండా పోతోందెందుకు.?