మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే.. మోదీ రాకతో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి. విమానాశ్రయ పరిసరాల్లో నల్ల బెలూన్లు ఎగురవేయడంతో కలకలం రేపింది. దీంతో గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై ఎస్పీ జాషువా తీవ్రంగా పరిగణించారని డీఎస్పీ విజయపాల్ అన్నారు.
దీంతో విచారణ చేపట్టామని అన్నారు. ఘటనలో ఐదుగురు పాల్గొన్నట్టు ప్రాధమికంగా గుర్తించినట్టు తెలిపారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ ఎగురవేసినట్టు గుర్తించామని.. ప్రస్తుతం రాజీవ్ పరారీలో ఉన్నాడని.. అతని కోసం గాలింపు చేపట్టామని వెల్లడించారు. నల్ల బెలూన్లు ఎగురవేసిన వారిలో రాష్ట్ర కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.