Tollywood: ప్రేక్షకులకు వినోదం అందించాలంటే చిత్రం ప్రదర్శన కావాలి. ప్రేక్షకాదరణకు నోచుకోవాలంటే ప్రదర్శన జరగాలి. అసలు దర్శక-నిర్మాతలు తీసే సినిమా ప్రదర్శన కావాలంటే ఉండాల్సింది ధియేటర్లు. అక్కడ ప్రదర్శన జరిగితేనే అంతిమ ఫలితాలు, లాభనష్టాలు, ప్రేక్షకాదరణ. ఇప్పుడు సినిమా ప్రదర్శన రూపం మారింది. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మాత్రమే ఉంటే ఇప్పుడు మల్టీప్లెక్స్ వచ్చేశాయి. సీ సెంటర్లలో కూడా మల్టీప్లెక్సులు ఏర్పాటవుతున్నాయి. అయితే.. సినిమా చూసేవాళ్ల సంఖ్య తగ్గుతోంది. వారిని రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ మధ్య లాభనష్టాల బేరీజు జరుగుతోంది. తెలంగాణలో ఇది ముదురుతోంది.
మే 1న విడుదలైన ‘జెట్లీ’ సినిమాను మల్టీప్లెక్స్ నిషేధించాయి. పర్సంటేజీ విధానంలో మల్టీప్లెక్సులు నడుస్తున్నాయి తమకూ పర్సంటేజీ అయితేనే లాభాలు వస్తాయని సింగిల్ స్క్రీన్ల ఎగ్జిబిటర్లు అంటున్నారు. అలా ఇస్తే తమకు నష్టమని నిర్మాతలు చెప్తున్నారు. హైదరాబాద్ పరిధిలోనే దాదాపు 23 ధియేటర్లు పర్సంటేజీ విధానంలో అయితేనే దియేటర్లు ఇస్తామని పట్టుబట్టారు. ప్రస్తుతం వివాదం జరుగుతూండగా జెట్లీ విడుదలవడం.. మల్టీ ప్లెక్సుల్లో సినిమా ప్రదర్శన నిషేధించాయి. దాంతో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్ పీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే.. వివాదం జెట్లీతోనే కాదు.. త్వరలో మైత్రీ నుంచి ‘పెద్ది’ రాబోతోంది. దీనికి నెల సమయముంది. సమస్య పరిష్కారంపై ప్రస్తుతం ప్రశ్నలు వస్తున్నాయి.
దీనిపై మైత్రీ సంస్థ సీఈఓ చెర్రికి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘పర్సంటేజీల్లో సినిమా ప్రదర్శన జరగాలనేది సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్ల డిమాండ్. అలా చేస్తే నిర్మాతలు తమకు ఇబ్బంది అంటున్నారు. మే 1 నుంచి పర్సంటేజీ అయితే ధియేటర్లు ఇస్తామని అన్నారు. దీనిపై చర్చించాలని ఫిల్మ్ చాంబర్ అనుకున్నా సాధ్యంకాలేదు. మే 8న మరోసారి జరిగే సమావేశం కీలకం కానుంది. సమస్య అప్పుడు పరిష్కారమవుతుందని భావిస్తున్నా’మని అన్నారు. పెద్దిపై భారీ అంచనాలు ఉన్నాయి. డిమాండ్ బట్టి ధియేటర్లు ఇవ్వాల్సి ఉంటుంది. మరి దీనిపై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య చర్చలు పరిష్కారమైతై పెద్దికి అడ్డంకులు లేనట్టే. మరి.. ఆ దిశగా ఇద్దరి మధ్యా పరిష్కారం చూపేది ఎవరు..? పెద్దికి అడ్డంకులు తొలగుతాయా..? చూడాలి.
