తెలుగు వచ్చిన అమ్మాయిల్ని హీరోయిన్లుగా ఇకపై ఎంకరేజ్ చేయకూడదని తాను, దర్శకుడు సాయి రాజేష్ ఓ నిర్ణయం తీసేసుకున్నామంటూ నిర్మాత ఎస్‌కేఎన్ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో పెను దుమారం రేపుతున్నాయి.
సినీ వేదికలపై సరదా వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. ఎస్‌కేఎన్ అంటే, కల్ట్ ప్రొడ్యూసర్.. అనే గుర్తింపు వచ్చింది. అది కూడా, ‘బేబీ’ సినిమాతో. అందులో హీరోయిన్‌గా నటించింది పదహారణాల తెలుగమ్మాయ్ వైష్ణవి చైతన్య. అంచనాలకు మించి వసూళ్ళను సాధించింది ఆ సినిమా.
నిజానికి, ఎప్పటినుంచో తెలుగు తెరపై తెలుగమ్మాయిలకు అవకాశాలు సరిగ్గా దక్కడంలేదన్న విమర్శ వుంది. ముంబై అందాల భామలతో పోటీ పడదగ్గ స్థాయిలో గ్లామర్ తెలుగమ్మాయిల్లోనూ వుందని చాలామంది తెలుగమ్మాయిలు ఆల్రెడీ ప్రూవ్ చేశారు.
నటన విషయానికొస్తే, తెలుగమ్మాయిలే బెస్ట్.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. తమిళ, మలయాళ, కన్నడ, ముంబై భామలతో పోల్చితే, తెలుగమ్మాయిలకి తెలుగు సినిమాల్లో అవకాశాలు చాలా అరుదుగానే దక్కుతుంటాయన్నది బహిరంగ రహస్యం. హీరోయిన్ స్నేహితుల లిస్ట్‌లో పడేస్తుంటారు తెలుగమ్మాయిల్ని.
ముంబై భామలు, తమిళ అలాగే కన్నడ, మలయాళ భామలు తెలుగు సినీ నిర్మాతల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించేసిన సందర్భాలనేకం. చాలా గొడవలు కూడా జరిగాయి గతంలో. కొందరు హీరోయిన్లను అనధికారికంగా బ్యాన్ చేశారు కూడా.
అలాగే, తెలుగమ్మాయిలతోనూ అక్కడక్కడా సమస్యలు వచ్చి వుండొచ్చేమో. అంతమాత్రాన, తెలుగమ్మాయిల్ని ఎంకరేజ్ చేయం, తెలుగేతర హీరోయిన్ల వైపే మొగ్గు చూపుతామని ప్రకటించడం ముమ్మాటికీ బాధ్యతా రాహిత్యమే.
తనకు ఎదురైన చేదు అనుభవమేంటో నిర్మాత ఎస్‌కేఎన్ వెల్లడించి వుండాల్సింది. అది హీరోయిన్ వైష్ణవి చైతన్య విషయంలోనే జరిగిందా.? ఏమో మరి.!