Cinema: బాహుబలి తర్వాత పాన్ ఇండియా మార్కెట్ పెరిగింది. అన్ని భాషల్లోకి సినిమా వెళ్తోంది. అభిమానులూ పెరిగారు. అయితే.. అభిమానం విషయంలో తమిళ ప్రేక్షకుల తీరు భిన్నం. భాషాభిమానం.. తమ హీరోలపైనే ఆరాధన.. ఇతర భాషల హీరోలపై అభిమానం తక్కువనేది తేటతెల్లం. కానీ.. తెలుగు ప్రేక్షకులు ఇందుకు పూర్తిగా భిన్నం. స్వాభిమానం ఉండదు. భాష ఏదైనా.. సినిమా బాగుంటే చాలు. పేరు తెలీని హీరో పేరు తెలుసుకుని మరీ అభిమానిస్తారు. దశాబ్దాలుగా ఇంతే. ఇది నిజమని తమిళ అగ్ర నిర్మాతల్లో ఒకరైన జ్ఞానవేల్ రాజా చెప్పుకొచ్చారు.. ఓ ఇంటర్వ్యూలో.
మనం ‘మన..’ వాళ్ళు ‘ వాళ్ల `
‘తెలుగు ప్రేక్షకుల అభిమానం వేరు. ప్రేక్షకులే కాదు.. తెలుగు మీడియా కూడా తమిళ హీరోల్ని మా రజినీకాంత, మా కమల్ హాసన్, మా సూర్య, మా కార్తి, మా విక్రమ్, మా విజయ్.. అంటూ తమవారిగా అభిమానిస్తారు. కానీ.. తమిళ ప్రేక్షకులు తెలుగు హీరోలను.. వారు.. తెలుగు హీరోలు అన్నట్టుగానే చూస్తారు. సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరించే పద్దతే వేర’ని చెప్పుకొచ్చారు. డబ్బింగ్ సినిమాలు, పరభాషా హీరోలపై తెలుగు ప్రేక్షకుల ఆరాధన చూస్తే ఇదే.
అంత క్రేజ్ మనవాళ్ళకి ఉందా..
శంకర్, మురుగదాస్, మణిరత్నం గౌతమ్ మీనన్.. తదితర తమిళ దర్శకులకు ఇక్కడ క్రేజ్. మన దర్శకులు అక్కడ ఎందరికి తెలుసు..? తమిళ హీరోలకు ఇక్కడ ఇమేజ్ ఎక్కువ. మరి.. అక్కడ తెలుగు హీరోలకు..? మన స్థాయిలో తెలుగు డబ్బింగ్ సినిమాలు అక్కడా ఆడుతున్నాయా, బిజినెస్ జరుగుతుందా..? సమాధానంలేని ప్రశ్నలే. తెలుగు మీడియా తమిళ హీరోలను బిరుదులతో మాట్లాడతారు.. రాస్తారు. తమిళ మీడియా మాత్రం తెలుగు హీరో పేర్లతోనే పలుకుతారు. దీనినే జ్ఞానవేల్ రాజా ఊటంకించారు.
మనకి సినిమా ఇష్టం..
తెలుగు ప్రేక్షకులకు సినిమా ఇష్టం. సినిమా బాగుంటే చాలు.. ఆదరిస్తారు. హీరోలను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు. ఇప్పుడు పాన్ ఇండియా కల్చర్ నడుస్తోంది. భాష తప్ప సినిమాకు హద్దులు చెరిగిపోయాయి. అంతర్జాతీయ వేదికలపై తెలుగు సినిమా సత్తా చాటి భారతీయ సినిమా గొప్పదనాన్ని చాటుతోంది. ఇక్కడ కూడా అలాంటి హద్దులు చెరిగి హీరోలకు అన్నిచోట్లా ఆదరణ.. అన్ని సినిమాలను ఆదరించాల్సిన అవసరం ఉంది.