Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో చేసినవి ఎక్కువగా మాస్ సినిమాలే అయినా.. కొన్ని క్లాసిక్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. వాటిలో ఆయన నటనా ప్రతిభ అద్భుతమని చెప్పాలి. అందులో కె.విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన ఒక మాస్టర్ పీస్ ‘ఆపద్బాంధవుడు’. సినిమాలో చిరంజీవి నటన ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు వచ్చినా.. వస్తుందనుకున్న జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రాలేదు. దీనిపై చిత్ర నిర్మాత తనయుడు ఏడిద రాజా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
‘చిరంజీవిగారి కెరీర్లో ఆపద్బాంధవుడు ఓ క్లాసిక్. సినిమాలో ఆయన నటనను ప్రేక్షకులు అద్భుతమని కొనియాడారు. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు ఖాయమని భావించాం. అవార్డు ప్రకటనకు ముందు మాకు ఇన్ఫో కూడా వచ్చేసింది. అయితే.. నార్త్-సౌత్ అనే విభేదాలు చూపి చిరంజీవికి అవార్డు రానీకుండా చేశారు. ఇప్పటికంటే అప్పట్లోనే ఈ వైరుధ్యాలు ఎక్కువ. లేదంటే.. తెలుగులో తొలి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు చిరంజీవిగారి పేరు మీదే ఉండే’దని అన్నారు.