రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పెరుమాళ్ళ ప్రణయ్ హత్య కేసులో నేడు నల్గొండ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ2 అయిన ముద్దాయి సుభాష్ కు ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం. ప్రణయ్ హత్య కేసు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సుభాష్ తో పాటు ఈ హత్యకు కారణమైన నిందితులకు జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం.
తన కూతురిని కులాంతర వివాహం చేసుకున్నాడని మిర్యాలగూడకు చెందిన మారుతీరావు సుపారీ గ్యాంగ్ తో 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ ని హత్య చేయించాడు. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు 8 మందిని నిందితులుగా పేర్కొంటూ 2019లో ఛార్జిషీట్ దాఖలు చేశారు.
దాదాపు ఆరేళ్లుగా విచారణ జరిగిన ఈ కేసులో వాదనలన్నీ ముగిశాయి. ఐతే ప్రణయ్ హత్య కేసులో ఏ1గా ఉన్న నిందితుడు మారుతీరావు 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఈ కేసులో ఏ2గా సుభాష్ కుమార్ శర్మ ఉండగా ఏ3గా అస్గర్ అలీ, ఏ4 బారీ, ఏ5 కరీం, ఏ6 శ్రవణ్ కుమార్, ఏ7 శివ, ఏ8 నిజాం లు నిందితులుగా ఉన్నారు.
తనకు ఈ కేసుతో సంబంధం లేదని అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ న్యాయస్థానాన్ని వేడుకున్నారు. మిగతా నిందితులు కూడా శిక్ష తగ్గించాలని తమపై దయ చూపించాలని కోర్టుని కోరారు.