ఇప్పుడున్న స్టార్ హీరోల్లో ప్రభాస్ యమ స్పీడుతో దూసుకుపోతున్నాడు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు అంటే ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఏ రెండేళ్లకో, మూడేళ్లకో ఒక సినిమా రావాలి. కానీ ప్రభాస్ మాత్రం ఫుల్ రివర్స్ లో వెళ్తున్నాడు. వరుసగా సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. ప్రతి ఏడాది ఒక సినిమా రిలీజ్ చేస్తానని గతంలోనే తన ఫ్యాన్స్ కు హామీ ఇచ్చాడు. అందుకు తగ్గట్టే పెద్ద డైరెక్టర్లను ముందే లాక్ చేసేసి ఒకేసారి రెండు, మూడు సినిమాల్లో నటించేస్తున్నాడు. ఇప్పుడు ది రాజాసాబ్ మూవీతో పాటు ఫౌజీ మూవీలో కూడా ఒకేసారి నటిస్తున్నాడు.
ఇవి రెండు లైన్ లో ఉండగానే అటు సందీప్ రెడ్డి వంగాను లాక్ చేసుకున్నాడు. అతనితో స్పిరిట్ మూవీ తీస్తున్నాడు. దాంతో పాటు కల్కి-2 కోసం నాగ్ అశ్విన్ ను, సలార్-2 కోసం ప్రశాంత్ నీల్ ను లాక్ చేసేశాడు. వీరి తర్వాత సినిమాల కోసం ఇప్పుడే కథలు కూడా వింటున్నాడంట. ప్రశాంత్ వర్మతో కూడా ఓ సినిమా ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇలా వరుసగా హిట్ డైరెక్టర్లను లాక్ చేసుకుని తన లైనప్ లో పెట్టేసుకుంటున్నాడు ప్రభాస్. అంటే ఒక సినిమా అటు ఇటు అయినా.. ఆ తర్వాత లైనప్ లో వచ్చే సినిమాలు కచ్చితంగా హిట్ అవ్వాలనే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు.
మరి ఇతర స్టార్ హీరోలు అయిన మహేశ్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ మాత్రం ఇంత ముందు చూపుతో లేరు. ప్రస్తుతం వారందరి చేతుల్లో ఒక్క సినిమా మాత్రమే ఉంది. మహేశ్ బాబు రాజమౌళితో మూవీ చేస్తున్నాడు. దాని తర్వాత ఏ ఒక్కరికి కమిట్ మెంట్ ఇవ్వలేదు. రాజమౌళి మూవీ తర్వాత రిజల్ట్ ను బట్టి ముందుకు వెళ్లాలని చూస్తున్నాడేమో. అటు ఎన్టీఆర్ ప్రస్తుతం వార్-2లో చేస్తున్నాడు. దాంతో పాటు ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. అంతే అవి తప్ప మరో సినిమాకు కమిట్ అవ్వలేదు. ఇటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 లాంటి పెద్ద హిట్ తర్వాత త్రివిక్రమ్ ను మాత్రమే లైన్ లో పెట్టుకున్నాడు.
ఆ తర్వాత ఒక్క డైరెక్టర్ ను కూడా ఓకే చేసుకోవట్లేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత సుకుమార్ తో ఓ సినిమా ఉంటుందని తెలుస్తోంది. కానీ అధికారిక ప్రకటన చేయలేదు. వీరందరికీ పాన్ ఇండియా క్రేజ్ ఉన్నా కూడా బడా డైరెక్టర్లను, హిట్ డైరెక్టర్లను ప్రభాస్ లాగా ఎందుకు లైన్ లో పెట్టుకోవట్లేదు.. ఎందుకు లాక్ చేసుకోవట్లేదో అర్థం కావట్లేదు. ప్రభాస్ డేట్స్ ఇచ్చేశాడు కాబట్టి ఆ డైరెక్టర్లు అంతా ప్రభాస్ కోసమే వెయిట్ చేస్తున్నారు. దాంతో ఈ హీరోలకు హిట్ డైరెక్టర్ల కొరత ఏర్పడిందనే చెప్పుకోవాలి.
ప్రభాస్ లాగా వీళ్లు ఏడాదికో సినిమా రిలీజ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇదే అదునుగా ప్రభాస్ వరుసగా సినిమాలను లైన్ లో పెడుతూ.. స్టార్ డైరెక్టర్లను తన వద్ద పెట్టేసుకుంటున్నాడు. మిగతా హీరోలు కూడా ప్రభాస్ లాగా ముందే డైరెక్టర్లను లాక్ చేసుకోవాలని వారి ఫ్యాన్స్ కోరుతున్నారు.