Prabhas Birthday Special: హీరోలకు స్టార్ స్టేటస్ వచ్చాక.. మాస్ ఇమేజ్ పెరిగాక చేయాల్సింది కమర్షియల్ సినిమాలే. అయితే.. అదే జోనర్లో ప్రతిసారీ వెళ్లలేరు. దీంతో నటనా ప్రాధాన్యమున్న సినిమాలు చేయాల్సిందే. ఫ్యాన్స్ కే కాదు, సాధారణ ప్రేక్షకులకీ హీరో నటన నచ్చాలి.. ఆల్ రౌండర్ అనిపించుకోవాలి. సాధారణంగా ప్రతి మాస్ హీరో చేసేది ఇదే. ప్రభాస్ కూడా కెరీర్లో అలా చేసిన హీరోనే. ఈశ్వర్, రాఘవేంద్ర, వర్షం, చత్రపతి.. లాంటి రోరింగ్ మాస్ సినిమాలు చేశాక నటనకు ఆస్కారమున్న పాత్రలే ఎంచుకున్నాడు. తనలోని నటనకు పదును పెట్టుకున్నాడు. అలా చేసిన సినిమాలో చక్రం, పౌర్ణమి సినిమాలు. ఫలితాలతో సంబంధంల లేకుండా రెండూ ప్రభాస్ నటనను వెలికితీసినవే.
చక్రం.. సినిమాలో ప్రభాస్ హుషారైన నటన ఆకట్టుకుంటుంది. డైరక్టర్ కృష్ణవంశీ మార్క్ పూర్తిగా కనిపించే సినిమాలో ప్రభాస్ తనదైన చిలిపి నటన, హుషారైన కామెడీ, క్లైమాక్స్ లో గుండెల్ని పిండేసే నటనతో మెప్పించాడు. జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా నిస్సత్తువగా.. నిరాశగా ఉండకూడదనే మెసేజ్ ఇచ్చే పాత్రలో ఒదిగిపోయాడు ప్రభాస్. ప్రభాస్ నటనకు ప్రేక్షకులు కూడా పాత్రకు కనెక్ట్ అయిపోయారంటే అతిశయోక్తి కాదు. క్లైమాక్స్ ప్రభాస్ పాత్ర చనిపోతుంది. తెలుగు ప్రేక్షకులకి హీరో పాత్ర చనిపోయే సాడ్ ఎండింగ్ అస్సలు వర్కౌట్ కానిది. మనసుల్ని కట్టిపడేసే పాత్రలో తనను తాను ఆవిష్కరించుకుని సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా మంచి పాత్రలో నటించిన పేరు తెచ్చుకున్నాడు ప్రభాస్.
పౌర్ణమి.. కథా బలమున్న సినిమా. ప్రేమించిన అమ్మాయి లక్ష్యాన్ని ఆమె సోదరి ద్వారా సాధించేలా చేసే ఉదాత్తమైన పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడు. ఈక్రమంలో వచ్చే యాక్షన్, సెంటిమెంట్ సన్నివేశాల్లో ప్రభాస్ నటన అభిమానులనే కాకుండా ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంది. ఫైట్స్ మాత్రమే కాదు.. ప్రభాస్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో కొత్తగా కనిపించాడు. అప్పటికి ఇదే బ్యానర్లో వచ్చిన వర్షం హిట్ కావడంతో పౌర్ణమిపై అంచనాలు భారీగా పెరిగాయి. కథా నేపథ్యం ఎక్కువగా ఉండటం సినిమాకు ప్లస్ అయింది. సెంటిమెంట్ సన్నివేశాల్లో ప్రభాస్ ఎంత బాగా నటించాడో.. విలన్ కుటుంబంలో కలసిపోయి కామెడీ కూడా అంతే సింపుల్ గా పండించాడు. సినిమా ఫలితం నిరాశపరచినా ప్రభాస్ యాక్టింగ్ స్కిల్స్ ను వెలికి తీసిన సినిమాగా నిలిచింది.
