జపాన్ తూర్పు తీరాన్ని సోమవారం రాత్రి భారీ భూకంపం బలంగా కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై 7.6 తీవ్రత నమోదై దేశవ్యాప్తంగా భయం నెలకొంది. భూకంపం తీరానికి 70 కిలోమీటర్ల దూరంలో, సుమారు 33 మైళ్ల లోతులో సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
జపాన్ సమయం ప్రకారం రాత్రి 11:15 గంటలకు వచ్చిన ఈ ప్రకంపనలు ఇవాటె, ఆమోరి వంటి తీరప్రాంతాలను ఎక్కువగా ప్రభావితం చేశాయి. ఈ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జపాన్ వాతావరణ విభాగం వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో సముద్ర అలలు మూడు మీటర్ల వరకు ఎత్తుకు చేరవచ్చని అంచనా వేయడంతో ప్రజలను హెచ్చరికలు ఇచ్చి సురక్షిత ప్రాంతాలక తరలించారు.
ప్రస్తుతం వరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఉన్న జపాన్‌కి భూకంపాలు, సునామీలు కొత్తేమీ కావు కానీ ఈసారి వచ్చిన తీవ్రత ప్రజల్లో ఆందోళన పెంచింది. పరిస్థితిని ప్రభుత్వ యంత్రాంగం దగ్గరగా పర్యవేక్షిస్తోంది.
