పోసాని కృష్ణ మురళి సినీ నటుడు.! సినిమాల్లో నటించడానికి రెమ్యునరేషన్ తీసుకుంటాడు. దర్శకుడిగా, రచయితగా రెమ్యునరేషన్లు అందుకునే వుంటాడాయన. రాజకీయాల్లోనూ ఆయన నటించాడు.. అదీ వైసీపీ తరఫున. సరే, రాజకీయాల్లో వున్న నటీనటులంతా రెమ్యునరేషన్లు తీసుకునే రాజకీయాలు చేస్తారనడం సబబు కాదు.!
కానీ, పోసాని కృష్ణ మురళి వ్యవహారం వేరు.! ‘నేను వైసీపీ నాయకుడిని కాదు’ అంటూనే, వైసీపీ తరఫున మాట్లాడుతూ, వైసీపీ రాజకీయ ప్రత్యర్థుల మీద బూతులు మాట్లాడేవాడు పోసాని కృష్ణ మురళి. ఏ వ్యక్తికైనా ఏదన్నా రాజకీయ పార్టీ మీద అభిమానం వుండడం తప్పు కాదు. రాజకీయ విమర్శల్నీ తప్పు పట్టలేం. అయితే, పోసాని కృష్ణ మురళి బూతులు మాత్రం, అభ్యంతరకరం, అత్యంత జుగుప్సాకరం.!
అంతలా బూతులు తిట్టినందుకుగాను, పోసాని కృష్ణ మురళికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా అవకాశం దక్కింది. ఆ పదవిలో పోసాని కృష్ణ మురళి, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఏం ఒరగబెట్టినట్లు.? పోనీ, సినీ పరిశ్రమకి ఆయన వల్ల ఆ పదవి కారణంగా ఏమైనా లాభం జరిగిందా.? ప్చ్.. ఏమీ లేదు.!
మరి, గౌరవ వేతనం కింద లక్షల రూపాయలు చెల్లించి, అంతకు మించిన స్థాయిలో సకల సౌకర్యాలూ కల్పించింది ఎందుకు.? ఇదంతా ప్రజాధనమే.! ప్రజాధనం వెచ్చిస్తున్నప్పుడు, ప్రతి రూపాయికీ లెక్కలుండాలి. ప్రజాధనం ఖర్చయితే, దానికి ప్రతిఫలంగా ఎంతోకొంత లాభం ప్రభుత్వానికి, తద్వారా రాష్ట్రానికీ వుండి తీరాలి.
మరి, పోసాని కృష్ణ మురళి వల్ల రాష్ట్రానికి ఎంత లాభం చేకూరింది.? గుండు సున్నా.! కాదు కాదు, రాష్ట్ర ఖజానాకి లక్షలాది రూపాయలు ‘బొక్క’ పడింది. సో, ఇప్పుడు ఆ లక్షలాది రూపాయల ‘గండి’కి సంబంధించి జవాబుదారీతనం ఎవరిది.?
పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేసింది, బూతులు మాట్లాడినందుకు, పవన్ కళ్యాణ్ ఇంట్లోని ఆడపిల్లలపై బెదిరింపులకు పాల్పడినందుకు, చంద్రబాబు అలాగే నారా లోకేష్‌పై దుర్భాషలాడినందుకు. దానికి సంబంధించిన శిక్ష పడుతుందా.? లేదా.? అన్నది వేరే చర్చ.
కానీ, ప్రజాధనం దుర్వినియోగమయ్యింది. ఆ మొత్తాన్నీ పోసాని కృష్ణ మురళి నుంచే ప్రస్తుత ప్రభుత్వం రాబట్టాల్సి వుంటుంది. లేదా, వైసీపీ నుంచి అయినా ఆ మొత్తాన్ని రాబట్టి, రాష్ట్ర ఖజానాకి జమ చేయాలి. జరుగుతుందా ఇదంతా.? రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో వున్న దరిమిలా, ఇలాంటివి ప్రస్తుత ప్రభుత్వం చేసి తీరాలి.
నామినేటెడ్ పోస్టులంటే, నో డౌట్.. అవి రాజకీయ నిరుద్యోగుల పునరావాస కార్యక్రమాలే. కానీ, వాటి నిమిత్తం కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రతి రూపాయీ ముఖ్యమే. వైసీపీ హయాంలో అడ్డగోలుగా అప్పటి ప్రభుత్వం వృధా చేసిన ప్రజాధనాన్ని ముక్కు పిండి మరీ వసూలు చేసి, ప్రభుత్వ ఖజానాకి జమ చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మన్ననల్ని పొందుతుంది. కానీ, అది సాధ్యమయ్యే పనేనా.?
