ప్రముఖ సినీ నటి పూనమ్ కౌర్ ఫైబ్రో మైయాల్జీయా అనే అరుదైన వ్యాధికి గురయింది. ఈమేరకు వైద్యులు నిర్ధారించారు. నిద్రలేమి, కండరాల నొప్పులు, జ్ఞాపకశక్తి తగ్గడం, చర్మ సంబంధిత సమస్యలు ఈ వ్యాధి లక్షణాలు. పూనమ్ ఈ వ్యాధికి గురైనట్టు నవంబర్ 18న నిర్ధారణైంది. ఆమె కేరళలోని ఓ ఆయుర్వేద ఆసుపత్రిలో చికిత్స తీసుకుని.. ప్రస్తుతం పూణెలోని ఆమె సోదరి నివాసంలో విశ్రాంతి తీసుకుంటోంది. పూనమ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.
పూనమ్ కౌర్ ఏడాదిగా చేనేత కార్మికుల తరపున పోరాడుతోంది. చేనేత వస్త్రాలపై కేంద్రం విధించిన జీఎస్టీని రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది. చేనేత ఉద్యమకారుడు వెంకన్నతో కలిసి సంతకాలు సేకరిస్తూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. నవంబర్ 10న సూరత్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఢిల్లీలో బ్రహ్మకుమారీ కార్యక్రమంలో పాల్గొనగా అక్కడ వెన్ను నొప్పి రావడంతో కేరళ వెళ్లి చికిత్స తీసుకుంది.