జిల్లాల లొల్లి పేరు చెప్పి స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. అల్లూరి జిల్లా విషయంలో వివాదం పెద్దగా లేదు. కానీ, స్వర్గీయ ఎన్టీయార్ పేరు విషయంలోనే వివాదం తెరపైకొచ్చింది. స్వర్గీయ నందమూరి తారకరామారావు సొంత ఊరు నిమ్మకూరు వున్న జిల్లాకి కాకుండా, మరో జిల్లాకి ఆయన పేరు పెట్టడం పట్ల ఆక్షేపణ వ్యక్తమవుతోంది.
అసలు వివాదాన్ని రాజేయాలన్న ఉద్దేశ్యం అధికార పార్టీకి లేకపోతే, ఇలా ఎందుకు చేస్తారు.? పైగా, ఎన్టీయార్ పేరు పెట్టేశాం, ఎన్టీయార్ కుటుంబ సభ్యులంతా మా కాళ్ళ కింద పడి వుండాలి.. అన్నట్టుగా వుంది అధికార పార్టీ తీరు. ‘మా జగనన్నకి ఎన్టీయార్ కుటుంబ సభ్యులెవరూ థ్యాంక్స్ చెప్పరేంటి.?’ అంటూ అధికార పార్టీ నేతలు దేబిరిస్తున్న తీరు చూస్తోంటే, ఆ పార్టీ ఎంత దయనీయ స్థితిలో పబ్లిసిటీ కోసం కొట్టుమిట్టాడుతోందో అర్థం చేసుకోవచ్చు.
కేవలం పబ్లిసిటీ స్టంట్లు చేయడానికేనా ప్రజలు వైసీపీకి అధికారం కట్టబెట్టింది.? అన్న ప్రశ్న ఇలాంటి సందర్భాల్లోనే తెరపైకొస్తుంది. ఎన్టీయార్ కుమార్తె భువనేశ్వరిపై అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అధికార పార్టీ నేతలు చేయించారు. కానీ, ఇప్పుడేమో ఎన్టీయార్ మీద ప్రేమతో ఓ జిల్లాకి ఆయన పేరు పెట్టేశామని అధికార వైసీపీ అంటోంది.
నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది అధికార వైసీపీ తీరు. లేకపోతే, ప్రభుత్వం ఏదన్నా మంచి పని చేసినప్పుడు.. అది నిజంగా మంచి పని అయితే, దానికి మంచి స్పందన వస్తుంది. స్పందన రాలేదంటే దానర్థం, చేసిన పనిలో డొల్లతనం వుందని. అది అర్థం చేసుకోలేనంత అమాయకత్వం వైసీపీలో వుందా.?
విజయవాడ జిల్లాకి వంగవీటి రంగా పేరు పెట్టి, కృష్ణా జిల్లాలోని మిగతా భాగానికి ఎన్టీయార్ పేరు పెడితే (నిమ్మకూరు కూడా అందులోనే వుంది) అసలు వివాదమే వుండదు. ఇప్పుడేమో, వంగవీటి జిల్లా కావాలనే డిమాండ్లు తెరపైకొచ్చాయి. ఈ పేర్ల లొల్లి ఇలా వుంటుందని తెలిసే రచ్చకి తెరలేపారంటే, దీని భావమేమి తిరుమల బాలాజీ.?