ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ వాక్యూమ్ అనూహ్యంగా కనిపిస్తోంది. కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ప్రాంత రాజకీయాలు.. ఇవేవీ వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపేలా కనిపించడంలేదు. గడచిన మూడేళ్ళలో రాష్ట్రంలో వైసీపీ పాలన ఎలా వుంది.? అన్న విషయానికొస్తే, వైసీపీకి గతంలో ఓట్లేసిన జనమే వైసీపీ ప్రజా ప్రతినిథుల్ని తరిమికొట్టే స్థాయికి పరిస్థితి మారింది.
‘ఒక్క ఛాన్స్..’ అంటూ గద్దెనక్కి, అసలంటూ జనం బతకడానికే అవకాశం లేకుండా చేసేశారన్న భావన ఆ జనం నుంచే వెల్లువెత్తుతోది. డబ్బులిచ్చి జనాన్ని తోలుకొస్తున్నా, నానా రకాలుగా ప్రలోభాలకు గురిచేసి, బెదిరింపులకు దిగి.. జనాన్ని రప్పిస్తున్నా.. ఆ జనాన్ని కాస్సేపు కూడా ఆయా సభల్లో వుంచలేని దుస్థితి వైసీపీది.
పార్టీ ప్లీనరీ సమావేశాలట.. రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నాయ్.. మంత్రులు, ఇతర ముఖ్య నేతలు ఆ కార్యక్రమాలకు హాజరువుతున్నారు. కానీ, కార్యకర్తలెక్కడ.? కార్తకర్తలు లేక ఆయా ప్లీనరీల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. మొన్నటికి మొన్న మంత్రులు ‘సామాజిక న్యాయ భేరి..’ అంటూ బస్సు యాత్ర చేస్తే, అక్కడా జనం కనిపించలేదు. కనీసం వైసీపీ కార్యకర్తలు కూడా మంత్రుల ‘షో’ వైపు కన్నెత్తి చూడని పరిస్థితి.
అధికార పక్షం మీద ఇంతటి వ్యతిరేకత స్పష్టంగా వున్నా, ఉప ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలుస్తోంది.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ఏమీ కాదు. ‘ఉప ఎన్నికల్లో వైసీపీకి ఓటెయ్యకపోతే, సంక్షేమ పథకాలు అందవ్..’ అన్న బెదిరింపులే, ఆయా ఉప ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి కారణమన్నది నిర్వివాదాంశం.
ఉప ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలూ ఒకటి కాదు. ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ తెలుసు. అందుకే, ఆయనలో అసహనం కట్టలు తెంచుకుంటోంది. అనూహ్యంగా 2019 ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ, ఆ తర్వాత వేగంగా పడిపోతున్న పార్టీ ఇమేజ్.. వెరసి, ముఖ్యమంత్రి వాస్తవ పరిస్థితుల్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
సందట్లో సడేమియా, జనసేన అనూహ్యంగా పుంజుకోవాన్ని వైసీపీ అస్సలు జీర్ణించుకోలేకపోతోంది. ‘అయితే, టీడీపీ లేకపోతే వైసీపీ.. ఈ రెండూ తప్ప ఇంకో పార్టీ వుండకూడదు..’ అన్న భావనలో వున్న వైసీపీ, జనసేనకి వచ్చే ఎన్నికలో జనం అధికారం కట్టబెడితే, తమ పరిస్థితేంటన్న బెంగ వుండడం సహజమే.
ప్రధానంగా కాపు సామాజిక వర్గంపై వైసీపీకి అనుమానాలు పెరిగిపోతున్నాయ్.! ఆ సామాజిక వర్గమంతా జనసేన వైపు వెళ్ళిపోతుందన్న ఆందోళనతోనే, అమలాపురం అల్లర్ల కథ నడిచింది. అది వైసీపీని ఇంకా వెనక్కి నెట్టేసిందన్నది రాష్ట్రంలో తాజా రాజకీయ విశ్లేషణల సారాంశం.
టీడీపీ పుంజుకునే అవకాశం లేదు. 2019 ఎన్నికల్లో వైసీపీకి, గతంలో టీడీపీకి చేసిన సన్మానమే రిపీట్ చేసేలా జనం వున్నారు. ఈ వాక్యూమ్ నడుమ, జనసేన గనుక సత్తా చాటితే.. టీడీపీతోపాటు, వైసీపీ రాజకీయ భవిష్యత్తు కూడా గల్లంతైపోయినట్టే.!