తిరుపతిలో దళిత యువకుడిపై జరిగిన దాడి ఘటనను పోలీసులు తీవ్రంగా తీసుకున్నారు. పవన్ కుమార్ అనే దళిత డ్రైవర్‌పై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు.
ఇప్పటికే పోలీసులు రంగంలోకి దిగారు. ఈ దాడి భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి కార్యాలయంలోనే జరిగినట్టు అనుమానిస్తున్నారు. కేవలం వారి ప్రోద్బలంతోనే, వారిద్దరి సమక్షంలోనే ఈ దాడి జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. బాధితుడి తండ్రి నీలం జయరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.
ఘటనలో ఇద్దరు ముగ్గురు పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు, జగ్గారెడ్డి అనే నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. మధ్యాహ్నం లోగా పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.
దాడిలో అనిల్ రెడ్డి, అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి పాత్రపై విచారణ కొనసాగుతోంది. అలాగే, దాడి సమయంలో వీడియోలు తీసి ఎవరెవరికీ పంపారన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ స్థాయిలో దాడికి ఏమిటీ కారణాలు? దళిత యువకుడిని అంతగా హింసించడానికి ఏ కారణాలున్నాయన్న అంశాలపై విచారణ కొనసాగుతోంది.
ఈ కేసును పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఘటనకు కారణమైన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
