Sai Dharam Tej: సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘గాంజా శంకర్’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇప్పుడీ సినిమా యూనిట్ కు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) షాక్ ఇచ్చింది. సినిమా టైటిల్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. టైటిల్ లో ఉన్న ‘గాంజా’ (గంజాయి) పదాన్ని తొలగించాలని సూచించింది.
సినిమాలో కూడా మాదక ద్రవ్యాల గురించి అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉంటే కూడా ఎన్డీపీఎస్-195 చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సినిమాలో గంజాయి సన్నివేశాలు, విద్యార్ధులు, యువతపై ప్రభావం చూపే సన్నివేశాలు ఉండకూడదని నోటీసుల్లో పేర్కొన్నారు. టీజర్లో గంజాయి మొక్కలు చూపడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ సినిమాను నిర్మిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ మాస్ గెటప్ లో కనిపిస్తున్నారు. భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.