జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో హైద్రాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం విమానాశ్రయానికి నిన్న సాయంత్రం చేరుకోవాల్సి వుంది. కానీ, ఎవరో ‘పిచ్చి సలహా’ ఇచ్చినట్టున్నారు.! వైఎస్ జగన్ సర్కారు, ఆ ప్రత్యేక విమానానికి అడ్డు తగిలింది.!
బేగంపేటలో విమానం టేకాఫ్ అవలేదు.! గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవాల్సిన పవన్ కళ్యాణ్, ఒకింత అసహనానికి గురయ్యారు. కానీ, అంతలోనే రోడ్డు మార్గాన మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని జనసేన అధినేత నిర్ణయించుకున్నారు. అంతే, రోడ్డు మార్గంలో పయనమైపోయారు.
తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయాణం సజావుగానే సాగింది. జాతీయ రహదారి మీద పవన్ కళ్యాణ్‌ని, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వద్ద అడ్డుకున్నారు అక్కడి పోలీసులు.! కథ మారిపోయింది అక్కడికక్కడే. క్షణాల్లో వందల మంది, వేల మంది జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పోగైపోయారు.
మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పీఏసీ సమావేశానికి జనసేన అధినేత హాజరైతే, పోలీసులకు వచ్చిన నష్టమేంటి.? ఇసుమంతైనా లాజిక్ కనిపించదక్కడ. ఎవరి బోడి సలహానోగానీ, పోలీసు శాఖ అత్యుత్సాహం ప్రదర్శించింది. ఫలితం.. అర్థ రాత్రి హైడ్రామా.!
చంద్రబాబుని కలిసేందుకు పవన్ కళ్యాణ్ వస్తున్నారంటూ టీడీపీ, వైసీపీ.. ఈ రెండు పార్టీల అను‘కుల’ మీడియా సంస్థలు కలిసికట్టుగా దుష్ప్రచారం చేశాయి. అది గుడ్డిగా నమ్మిన ఆంధ్రప్రదేశ్ పోలీస్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని అడ్డుకునేందుకు ప్రయత్నించడం శోచనీయం.
రాష్ట్రంలో వ్యవస్థలు ఎలా తగలడ్డాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? గరికపాడు చెక్‌పోస్టు దగ్గర్నుంచి, మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వరకూ.. వందలాది, వేలాది మంది జనసైనికులు, తమ అధినేతకు రక్షణగా నిలిచారు. ఓ దశలో జనసేన అధినేత, తనకు ఆటంకం కలిగిస్తున్న పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపైనే బైఠాయించారు కూడా.!
పోలీసులు, పవన్ కళ్యాణ్‌ని అరెస్టు చేసేందుకూ ప్రయత్నించారు. పవన్ కళ్యాణ్ కొంత దూరం రోడ్డుపైనే నడిచి ముందుకు వెళ్ళడం గమనార్హం. పోలీసులు చేసేది లేక, తమ వాహనంలో కొంత దూరం ముందుకు తీసుకెళ్ళారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సొంత వాహనంలోకి ఎక్కించక తప్పలేదు. దారి పొడుగునా జనసేన అధినేతకు జనం నీరాజనాలు పలికారు. అదీ అర్థరాత్రి వేళ.
విజయవాడ నగరంలో అయితే, మహిళలు అలాగే చిన్న పిల్లలు సైతం, పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూశారు. మంగళగిరి పార్టీ కార్యాలయానికి జనసేన కీలక నేతలతోపాటు వందలాదిగా కార్యకర్తలూ చేరుకున్నారు. వారందరికీ అభివాదం చేసిన జనసేన అధినేత, జనసేన పార్టీ కార్యాలయంలోకి వెళ్ళారు.
‘పార్టీ సమావేశం కోసం మంగళగిరి వెళుతున్నాను. కోర్టు ప్రాంగణంలోకి నేనెలా వెళతానని అనుకున్నారు..’ అంటూ స్పష్టతనిచ్చారు ‘చంద్రబాబు కోసం వస్తున్న పవన్ కళ్యాణ్’ అంటూ సాగిన బులుగు పచ్చ ప్రచారంపై.!
అదే, ప్రత్యేక విమానాన్ని కృష్ణా జిల్లా ఎస్పీ అడ్డుకోకపోయి వుంటే, నేరుగా బేగంపేట విమానాశ్రయం నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో.. ఎలాంటి గందరగోళం లేకుండా జనసేనాని, మంగళగిరి రాష్ట్ర కార్యాలయానికి చేరుకునేవారే కదా.! ఇంతకీ, ‘అడ్డుకోవడం’ అనే బోడి సలహా ఇచ్చింది ఎవరు.? అన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనూ జరుగుతోంది.!