ఆపరేషన్ సిందూర్ ఆగలేదు.. స్వల్ప విరామం అంతే.! పాకిస్తాన్ వైపు నుంచి ఒక్క తీవ్రవాది, ఎలాంటి ఘాతుకానికి పాల్పడినా, ప్రతిస్పందన చాలా చాలా తీవ్రంగా వుంటుంది. నదిలో నీళ్ళు, రక్తం.. ఒకేసారి పారేందుకు వీలు కుదరదు. తీవ్రవాదం, ట్రెర్రరిజం.. రెండూ ఒకేసారి అస్సలు కుదరదు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, పాకిస్తాన్‌కి ఇచ్చిన సీరియస్ వార్నింగ్ సారాంశం ఇది. పాకిస్తాన్ బతకాలంటే, పాకిస్తాన్‌లో తీవ్రవాదం చచ్చిపోవాల్సిందేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ‘పాకిస్తాన్.. మీ దేశం బతకాలంటే, మీరే మీ దేశంలోని తీవ్రవాదాన్ని అంతం చేయాలి..’ అని అల్టిమేటం జారీ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.
పహల్గామ్ టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో, భారత త్రివిధ దళాలు పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్ పేరుతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌లోని కొన్ని ఎయిర్ బేస్‌లు ఈ ఆపరేషన్‌లో ధ్వంసమయ్యాయి. పదుల సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు చనిపోయారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అలాగే పాకిస్తాన్‌లో ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత త్రివిధ దళాలు నిర్వహించిన దాడుల్లో పెద్దయెత్తున తీవ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. వందల సంఖ్యలో తీవ్రవాదుల్ని మట్టుబెట్టడం కూడా జరిగింది.
ఏం జరిగిందోగానీ, పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది. శాంతి చర్చలంటూ కాల్పుల విరమణ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్.. కాస్త విరామం తీసుకుంది.
అయితే, ఉగ్రవాదం అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ తప్ప.. పాకిస్తాన్‌తో వేరే అంశంపై చర్చలు జరిపే ప్రసక్తే లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. పాకిస్తాన్‌తో శాంతి చర్చలన్న మాటకు తావు లేదని తేల్చి చెప్పారు ప్రధాని మోడీ.
‘ఇకపై పాకిస్తాన్ నుంచి చిన్నపాటి కవ్వింపు చోటు చేసుకున్నా, భారత దేశం నుంచి ప్రతిస్పందన అత్యంత తీవ్రంగా వుంటుంది.. ఇదే ఇకపై న్యూ నార్మల్..’ అని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు.
న్యూక్లియర్ వెపన్స్ పేరుతో పాకిస్తాన్ ఇకపై బ్లాక్‌మెయిల్ వేషాలు వెయ్యలేదనీ, దానికి ‘ఆపరేషన్ సిందూర్’తో ఇవ్వాల్సిన స్థాయిలో సమాధానం ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం గమనార్హం. పహల్గామ్‌లో భారత దేశానికి చెందిన సోదరీమణులు నుదుటున సిందూరం కోల్పోయారు.. దానికి ప్రతిగా, పాకిస్తాన్‌ని కోలుకోలేని దెబ్బ తీశాయి భారత త్రివిధ దళాలు.. అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.
