PKSDT:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan) సినిమాల్లో వేగం పెంచారు. ఓవైపు రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ఇప్పటికే ఒప్పుకొన్న సినిమాలను త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. సాయిధరమ్ తేజ్( Sai Dharam Tej) తో కలిసి ఆయన నటిస్తున్న ‘PKSDT’ చిత్రం జూలై 28న విడుదల కానున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. తమిళంలో విడుదలై సూపర్ హిట్ అందుకున్న ‘వినోదాయ సీతం’ సినిమాకు ఇది రీమేక్ గా రూపొందుతోంది. తమిళంలో దర్శకత్వం వహించిన సముద్రఖని (Samuthirakani) తెలుగు సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నారు.
తమిళంలో సముద్రఖని చేసిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. తంబి రామయ్య పాత్రలో సాయిధరమ్ తేజ్ కనిపించనున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ ఇందులో దేవుడి పాత్రలో కనిపించనుండటంతో ఈ సినిమాకు ‘దేవుడు’ అనే టైటిల్ ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈయన పాత్రకి సంబంధించిన చిత్రీకరణ ఈనెల ఆఖరికి పూర్తి కానుంది. ప్రస్తుతం పవన్ చేతిలో ఇది కాకుండా మరో మూడు సినిమాలు ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ‘ భవదీయ భగత్ సింగ్’ కి పూజా కార్యక్రమాలు జరిగాయి. సుజిత్ దర్శకత్వంలో ‘ ఓజీ’ తెరకెక్కనుంది.