“రాజకీయాల్లో ఏది అనుకోకుండా జరగదు. ఒకవేళ జరిగితే అది ఆ విధంగా ప్లాన్ చేయబడిందని మీరు బెట్ వేయవచ్చు” ఫ్రాంక్లిన్ డి రూజ్ వెల్డ్ – అమెరికా మాజీ ప్రెసిడెంట్.
రాజకీయాల్లో ఎప్పుడూ ఏది ఎలా జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఏపీ మంత్రి నారా లోకేష్, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయిన విధానం కూడా అలాగే అనిపిస్తోంది. సాధారణంగా అయితే తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగేళ్ల వరకు ఎన్నికలు లేవు. అయినా వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీ వెళ్లిన లోకేష్.. పీకే తో దాదాపు గంటసేపు సమావేశమయ్యారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతంపై వీరిద్దరూ చర్చించుకున్నట్లు సమాచారం. టీడీపీ బలోపేతంపై ఇప్పటికే కొన్ని ప్రణాళికలు పీకే రెడీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపైనే వీరిద్దరి చర్చ సాగినట్లు సమాచారం.
బీఆర్ఎస్ పై ట్రిగ్గర్..
2023 లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. అయితే ఇప్పుడు టీడీపీ.. ఆ పార్టీ పైనే గురి పెట్టనుంది. గులాబీ పార్టీలో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్, నామా నాగేశ్వరరావు, ఎల్ రమణ, సత్యవతి రాథోడ్, కడియం శ్రీహరి తదితరులందరూ టీడీపీ కి చెందినవారే. తెలంగాణలో టీడీపీ కి కేడర్ ఉన్నప్పటికీ సరైన నాయకుడు లేడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణపై దృష్టి సారిస్తే.. కీలక నేతలందరూ తిరిగి సొంతగూటికి చేరుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు ఉండటంతో పీకే తో లోకేష్ బేటి కూడా ఆసక్తికరంగా మారింది. అయితే టీడీపీ గురి పంచాయతీ ఎన్నికలతోనే మొదలవుతుందా లేదా వచ్చే ఎన్నికల్లోపు బలపడాలనే ఉద్దేశంతో ఉందా అనేది తెలియాల్సి ఉంది. విశ్లేషకుల అంచనాలు నిజమే అయితే ఇప్పటికే లోక్ సభ ఎన్నికల ఫలితాల విషయంలో షాక్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలినట్లే.