“మీరు వచ్చాక ఇళ్ల పట్టాలు ఇప్పించి నాలుగు దశాబ్దాల మా కల నెరవేర్చారు సార్. మీకు చెప్పగానే మా కాలనీకి కుళాయి వచ్చింది. విద్యుత్తు సరఫరా అందింది. మా సమస్యలన్నీ తీరాయి” అంటూ పిఠాపురం నియోజకవర్గ మహిళలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం ఆయన పిఠాపురంలో పర్యటించారు. జనాల్లోకి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
నియోజకవర్గ పరిధిలోని వాక తిప్ప గ్రామ పరిధిలోని కాలనీలో తాగునీటి సమస్య గురించి ఎన్నికల ముందు అక్కడి ప్రజలు తెలియపరిచారు. అధికారంలోకి రాగానే తాగునీటి సమస్య తీరుస్తానంటూ అప్పట్లో పవన్ మాట ఇచ్చారు. అనుకున్న విధంగానే ఆ కాలనీకి పైపులైన్ ద్వారా కుళాయి నీళ్లు అందించేలా చర్యలు తీసుకున్నారు. 16వ వార్డు రథాలపేటలోని మహిళల నాలుగు దశాబ్దాల నాటి కలను డిప్యూటీ సీఎం నెరవేర్చారు. ఎమ్మెల్యేగా తొలి పర్యటనలో ఆయన దృష్టికి వచ్చిన ఇళ్ల పట్టాల సమస్యను వెంటనే తీర్చడంతో అక్కడి మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.
కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన కొందరు తమ గ్రామ పరిధిలో బీసీల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరారు. అదేవిధంగా 15వ వార్డులోని మోహన్ నగర్ వాసులు కూడా తాగునీటి ఇబ్బందుల గురించి పవన్ కు విన్నవించారు. యుద్ధ ప్రాతిపదికన ఆ సమస్యలను తీరుస్తానంటూ పవన్ ప్రజలకు మాటిచ్చారు. తమ సమస్యలన్నింటికీ డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించడంతో అక్కడ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
