‘మీ అబ్బాయి/అమ్మాయి మా కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఎవరైనా ఫోన్ చేసి డొనేషన్ కట్టారా..? అంటే కట్టలేదని చెప్పండి..’ అని తల్లదండ్రులకు ఓ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి చెందిన కళాశాలల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ కళాశాలల నుంచి తాము డొనేషన్లు తీసుకున్న విద్యార్ధులకు ఇలా ఫోన్లు చేయిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ అంశం సంచలనం రేపుతోంది. మల్లారెడ్డి కళాశాలల్లో డొనేషన్లు తీసుకున్నారా.. అనే కోణంలో ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. దీంతో మిగిలిన కాలేజీ యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు బ్రాంచిని బట్టి లక్షల్లో డొనేషన్లు తీసుకున్నాయి. బీటెక్-కంప్యూటర్ సైన్స్ కు ఏకంగా 12-15 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. నగదుగా వసూలు చేసిన డొనేషన్లకు రసీదు ఇవ్వకపోవడంతో ఇవి లెక్కల్లోకి రావు. ఈనేపథ్యంలో కళాశాల యాజమాన్యాలు అప్రమత్తమై ఫోన్ కాల్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది.