సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ హెలికాప్టర్లు, విమానాల్లో ప్రయాణిస్తే అవి పడిపోవాలనే పేర్ని నాని వ్యాఖ్యలు వైసీపీ నేతల శాడిజం, నీచ బుద్ధిని స్పష్టంగా బయటపెడుతున్నాయని ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇలాంటి కామెంట్లు చేయడం వైసీపీ దాచిన కుట్రపూరిత ఆలోచనలకు నిదర్శనమైందన్నారు. ఇతరుల ప్రాణాలు ప్రమాదంలో పడాలని కోరుకునే మనస్తత్వం వైసీపీ నేతల్లో నాటుకుపోయిందని, ఇది ప్రజాస్వామ్యానికి అవమానమని వ్యాఖ్యానించారు.
శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం శ్రమిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌లపై చెడు కోరడం పరోక్షంగా ప్రజలకే శాపమని అన్నారు. పేర్ని నాని వ్యాఖ్యలు పిల్లి శాపాలవంటి అర్ధరహితమైనవని, ప్రజలు అలాంటి మాటలను తీవ్రంగా ద్వేషిస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ తండ్రి వైఎస్సార్ కూడా హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం ఉండగా, ఇలాంటి వ్యాఖ్యలు వైసీపీ నేతల అమానుష వైఖరిని చూపుతున్నాయని పేర్కొన్నారు.
అలాగే బందరు రాజకీయాల్లో పేర్ని నాని వ్యక్తిత్వం అందరికీ తెలిసినదే అని, భార్య పేరుతో గోడౌన్లు పెట్టి రేషన్ బియ్యం దోపిడీ చేసిన స్కామ్ కూడా ప్రజలు మర్చిపోలేదని గుర్తుచేశారు. కేసు వస్తుందని భయపడి కంగారుతో జరిమానా కట్టి తప్పించుకున్నాడని అన్నారు. అంతేకాక, మాజీ మంత్రి పేర్ని కృష్ణమూర్తి చివరి రోజుల్లో ఆయనకు తిండి పెట్టడానికైనా నాని ముందుకు రాలేదని, కృష్ణమూర్తి విక్టోరియా గారి వద్దే తమ చివరి రోజులు గడిపారని శ్రీనివాస్ ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ పైన నాని చేసిన వ్యాఖ్యల్ని కూడా ఆయన ఖండించారు. పవన్ కళ్యాణ్ తన విమాన ప్రయాణాలకు ఒక్క పైసా కూడా ప్రభుత్వ నిధులు వాడరని, మంత్రిగా వచ్చే జీతం మొత్తం అనాథల కోసం ఖర్చు చేస్తున్న వ్యక్తిని అవినీతి మాటలు పెట్టడం వైసీపీ నేతల అసూయ, అబద్ధాల రాజకీయాలకే నిదర్శనమని చెప్పారు. ప్రజల కోసం పగలు రాత్రి కష్టపడే నాయకుల గురించి ఇలా మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరని, నానికి ప్రజల నుంచే సమాధానం వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.
సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌లపై దుష్ప్రచారం చేయడం వైసీపీకి బూమరాంగ్ అవుతుందని, రాజకీయాల్లో గౌరవం, నైతికత ఎందుకు అవసరమో ప్రజలు వైసీపీకి త్వరలోనే చెబుతారని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు.
