Perni Nani: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు అధికార వైసీపీకి గుండు కొట్టేశారు. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే.! మూడు రాజధానులన్నారు.. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లోనూ వైసీపీని ఓటర్లు నిండా ముంచేశారు.! కుప్పంలో కొడతాం.. అని వైసీపీ నినదిస్తే.. పులివెందులలో కొట్టి చూపించారు పట్టభద్రులు. ఇలాంటి పరిస్థితుల్లోనే తమ వైఫల్యాల్ని అంగీకరించి, ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంటుంది. అధికార పార్టీకి అది చాలా చాలా అవసరం. కానీ, అధికార వైసీపీ చిత్రమైన వాదనని తెరపైకి తెచ్చింది. ‘పట్టభద్రులు వేరు.. ప్రజలు వేరు..’ అంటోంది వైసీపీ. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ మంత్రి పేర్ని నాని.. ఇంకా చాలామంది వైసీపీ నేతలు ఇదే వాదనను తెరపైకి తెస్తున్నారు.
ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో పేర్ని నాని ‘పట్టభద్రులు వేరు.. ప్రజలు వేరు..’ అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నవ్వులపాలవుతున్నాయి కూడా.! ప్రజల్లోంచే పట్టభద్రులు వస్తారన్న కనీసపాటి ఇంగితం లేని పేర్ని నాని, మంత్రిగా పని చేయడం.. నిజంగానే రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఆ మధ్య ‘వారాహి’ వాహనానికి సంబంధించిన రంగుని రవాణా శాఖ అనుమతించదని, గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన పేర్ని నాని సెలవిచ్చారు. ఇప్పుడేమో, ‘అలాగని ఎవరన్నారు..’ అంటూ బుకాయిస్తున్నారు. ఇదీ వైసీపీ సిద్ధాంతం.! ఇక్కడ ఇంతే. గెలుపు వైసీపీ ఖాతాలో.. ఓడిపోతే, అస్సలు సంబంధం వుండదు వైసీపీకి.! పట్టభద్రుల్లోనే ఇంతటి వ్యతిరేకత అధికార పార్టీ మీద వుందంటే, ప్రజల్లో వ్యతిరేకత ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు.
అందునా, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలోనూ పట్టభద్రులు, వైసీపీని ఛీ కొట్టడం.. అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. రాయలసీమలో, ఉత్తరాంధ్రలో.. వైసీపీకి పట్టభద్రులు చుక్కలు చూపించిన వైనం.. అధికార పార్టీకి చెంప పెట్టు. న్యాయ రాజధాని లేదు.. కార్య నిర్వాహక రాజధాని అసలే లేదు. వైసీపీ మూడు రాజధానుల నినాదం అట్టర్ ఫ్లాప్ అని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో తేలిపోయింది. అందుకే, అసలు పట్టభద్రులంటే ప్రజలే కాదన్న వింత వాదనని వైసీపీ తెరపైకి తెచ్చింది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే, అసలు ప్రజలు ఓటర్లే కాదని వైసీపీ నినదించినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదు. ఏడో తరగతి ఫెయిలయినోళ్ళతోనూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లేయించిన వైసీపీ, ఎలా చావు దెబ్బ తినేసిందబ్బా.? అంటే, కొనుక్కొచ్చిన ఓటర్లు కూడా వైసీపీకి షాక్ ఇచ్చారన్నమాట.