పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండానే పవన్ కళ్యాణ్ ‘జయ కేతనం’ ప్రసంగాన్ని ముగించారు.
సుదీర్ఘ ప్రసంగంలో ఎక్కడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరుని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని పిఠాపురంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఈ ‘జయకేతనం’ బహిరంగ సభని కానుకగా జనసేనాని ఇచ్చారన్న చర్చ, స్థానికంగా జరిగింది. ‘పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో జగన్ పేరు ప్రస్తావించకపోవడమే మంచిది’ అని చాలామంది జనసైనికులు కోరుకున్నారు.
అయితే, ‘కార్పొరేటర్‌కి తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ’ అంటూ ఇటీవల వైఎస్ జగన్ చేసిన కామెంట్ల నేపథ్యంలో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జయకేతనం బహిరంగ సభలో కౌంటర్ ఎటాక్ ఇస్తారని అంతా అనుకున్నారు.
వైసీపీ ప్రస్తావన ఒకట్రెండు సందర్భాల్లోనే, అదీ పరోక్షంగా తీసుకొచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్ ‘జయకేతనం’ బహిరంగ సభలో. మనది 11వ ఆవిర్భావ దినోత్సవం.. అందుకే, వాళ్ళకి 11 సీట్లకు పరిమితం చేశాం.. అని పవన్ కళ్యాణ్ చమత్కరించారు ఓ సందర్భంలో.
తిట్టారు, తూలనాడారు, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమన్నారు.. కానీ, బద్దలుగొట్టాం కదా.. అని ఇంకో సందర్భంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. స్పష్టంగా, రాష్ట్ర ప్రజలకు అలాగే దేశ ప్రజలకు పవన్ కళ్యాణ్ స్పష్టమైన సందేశం ఇవ్వాలనుకున్నారు, ఆ సందేశానికే పరిమితమయ్యారాయన.
మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ నాగబాబు, ఎంపీ బాలశౌరి తదితరులు, తమ ప్రసంగాల్లో వైసీపీని ప్రస్తావించారు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరునీ కొందరు ప్రస్తావించారు. ‘నీ తండ్రి ముఖ్యమంత్రి అయి వుండకపోతే, నువ్వు కౌన్సిలర్ అయినా అయి వుండేవాడివా.?’ అని జగన్‌ని సూటిగా ప్రశ్నించారు మంత్రి కందుల దుర్గేష్.
అంతే తప్ప, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అసలంటూ జగన్ పేరుని ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ప్రస్తావించేందుకు ఇష్టపడలేదు. ‘ఆ స్థాయి అతనికి లేదు’ అని బహుశా పవన్ కళ్యాణ్ అనుకుని వుండొచ్చు.
భవిష్యత్ లక్ష్యాలు పెద్దవిగా పెట్టుకున్నట్లు చెప్పిన జనసేనాని, వైసీపీ అనే రాజకీయ పార్టీని కాలగర్భంలో తొక్కేశానన్న భావనలో వున్నారేమోనని జనసైనికులు చర్చించుకోవడం జరిగింది జయకేతనం బహిరంగ సభలో.
మీడియా, రాజకీయ వర్గాల్లో కూడా దాదాపు ఇలాంటి చర్చే జరుగుతోంది. ‘పవన్ కళ్యాణ్ చేసింది ముమ్మాటికీ కరెక్టే. తన స్థాయిని పవన్ కళ్యాణ్ దిగజార్చుకోవాలనుకోలేదు. వైఎస్ జగన్ అలా కాదు, ఎప్పుడో పాతాళానికి దిగజారిపోయాడు’ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే తీరు ముందు ముందు కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి, వైఎస్ జగన్ విషయంలో ఆశించొచ్చేమో.! అదే గనుక జరిగితే, వైఎస్ జగన్ అనే పేరు, రాష్ట్ర రాజకీయాల నుంచి అత్యంత వేగంగా కనుమరుగైపోవచ్చు