ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని అవాంఛనీయ సోషల్ మీడియా, సాధారణ గ్రూపుల్లో ఆయన ప్రస్తావన వచ్చిందని.. ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని చెప్పినట్లు సమాచారం. పవన్ ని టార్గెట్ చేసిన ఆ గ్రూపులు ఎవరివి అనేది స్పష్టంగా చెప్పలేమని నిఘా వర్గాలు తెలిపాయి. కానీ పవన్ తన భద్రత పట్ల పటిష్ట జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశాయి. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం ఆయనకు జెడ్ ప్లస్ సెక్యూరిటీని నియమించే అవకాశం ఉంది. జనసేనాని ఎన్డీఏ కూటమిలో ఉండటం, ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన గట్టి మద్దతుదారు కావడంతో మావోయిస్టులు కొందరు పవన్ ని టార్గెట్ చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనకు ముప్పు ఉందన్న వార్తలు రావడంతో వాస్తవంగా ఆయనకు డిసెంబర్లోనే సెక్యూరిటీ కల్పించారు. తాజాగా నిఘా వర్గాల హెచ్చరికతో మరింత భద్రత పెంచే అవకాశం ఉంది. పవన్ పై వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో జనసైనికుల్లో ఆందోళన నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన పవన్.. డిప్యూటీ సీఎం తో పాటు పలు శాఖలకు మంత్రిగా పనిచేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు.