మొత్తానికి భారీ పోటీ మధ్య .. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసాయి. ఎన్నికల తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఆశించిన స్థాయి సీట్స్ రావని .. వచ్చిన సీట్లను మరో పార్టీలో కలిపే ఆలోచనలో ఉన్నారంటూ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా అటు రాజకీయాలపై దృష్టి పెడుతూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తాడని, ఇప్పటికే ఆయన మైత్రి మూవీస్ వాళ్లకు ఇచ్చిన కమిట్మెంట్ నెరవేర్చేందుకు రెడీ అయ్యాడంటూ వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో పాటు మరో రెండు సినిమాలు కూడా రెడీగా ఉన్నాయంటూ ప్రచారం జోరుగా జరుగుతుంది.
ఈ విషయం పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. చిరంజీవికి కంటే కూడా పవన్ కళ్యాణ్ కు జనాలంటే ఎక్కువ ప్రేమని, వారితోనే కలిసి ఉండాలని పవన్ అనుకుంటున్నాడని అన్నారు. 2009 లో చిరంజీవిగారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు విఫలం అయ్యామని, అందుకే దాన్ని కాంగ్రెస్ లో కలిపేసి అన్నయ్య అందులో చేరాడని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్నయ్య ఎలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదని అన్నారు. ఎపి విభజన సమయంలో విభజన జరగొద్దంటూ గట్టిగా నిలబడ్డారని, కానీ ఎపి విభజన జరిగాక కాంగ్రెస్ పార్టీపై ఆంధ్ర ప్రదేశ్ ప్రజల విశ్వసనీయత పోయిందన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని, జనాల్లో జనసేనకు ఓటు వేయాలన్న ఆలోచన పెరిగిందని అన్నారు.
ఇక పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా నాగబాబు స్పందిస్తూ .. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రానని ముందే చెప్పారన్న విషయం మీకు గుర్తుండే ఉంటుంది. కావాలని పవన్ ను కెలుకుతున్నారు. కళ్యాణ్ బాబును ముట్టుకోకుండా ఉంటేనే మంచింది సార్ .. ఎవరైనా అతన్ని అణిచివేయాలని చుస్తే 100 రేట్లు పైకి లేస్తాడు అంటూ కాస్త ఘాటుగానే సమాధానం చెప్పాడు. మొత్తానికి నాగబాబు చెప్పినదాన్ని బట్టి చుస్తే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేవనే అనిపిస్తుంది. మరి ఈ విషయం పై పవన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.