కొన్ని నెలల క్రితం హైద్రాబాద్‌లో ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఆ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల తారకరామరావు హాజరయ్యారు. మళ్ళీ ఇప్పుడు మరో మరో మెగా ఫంక్షన్‌కి ఆయన ముఖ్య అతిథుల్లో ఒకరిగా పాల్గొనబోతున్నారు. ఈ నెల 18వ తేదీన హైద్రాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న ‘సైరా నరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అది. ఇదే వేడుకకు మరో ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతుండడం గమనార్హం.
ఒకే వేదికపై కేటీఆర్, పవన్ కళ్యాణ్ కన్పిస్తే.. ఆ మూమెంట్‌పై ముందస్తుగా రాజకీయ ఊహాగానాలు రాకుండా వుంటాయా.? కేటీఆర్, తెలంగాణ రాష్ట్ర సమితికి వర్కింగ్ ప్రెసిడెంట్. పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షుడు. అయితే, ఈ కలయికను రాజకీయ కోణంలో చూడలేం. అయినాగానీ, కొంత రాజకీయ రచ్చకు అయితే ఆస్కారం లేకపోలేదు. ‘వినయ విధేయ రామ’ సమయంలో జనసేన జెండాలతో పవన్ కళ్యాణ్ అభిమానులు అలియాస్ జనసైనికులు హల్‌చల్ చేసిన విషయం విదితమే.
Also Read: మళ్ళీ సినిమాల్లోకి పవన్ కళ్యాణ్: ఏది నిజం.?
వారిని చూసి కేటీఆర్, ఆచి తూచి మాట్లాడారు. ఎక్కడా ఎలాంటి వివాదాలకూ ఆస్కారమివ్వలేదు. అది ఆయన హుందాతనం. ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో కూడా అదే హుందాతనం ఇటు కేటీఆర్, అటు పవన్ పాటిస్తారన్నది నిర్వివాదాంశం. ఎలాంటి వివాదాలకూ ఆస్కారమివ్వకుండా ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోబోతున్నారట. ఎల్బీ స్టేడియంలోకి పార్టీల జెండాలు రాకుండా చూడాలని నిర్వాహకులకు ఇప్పటికే ఆదేశాలు వెళ్ళినట్లు తెలుస్తోంది.
‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత చరిత్ర. ఇది ప్రతి తెలుగువాడూ తెలుసుకోవాల్సిన చరిత్ర. నిజానికి, కర్నూలులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాలనుకున్నా, కొన్ని కారణాలతో అది హైద్రాబాద్‌కి షిఫ్ట్ అయ్యింది. అక్టోబర్ 2న ‘సైరా నరసింహారెడ్డి’ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే.
