జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తమిళనాడు అలాగే కేరళ రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల్ని గత కొద్ది రోజులుగా సందర్శించి, ఈ రోజు సాయంత్రం గన్నవరం చేరుకున్నారు.
సనాతన ధర్మ పరిరక్షణ మనందరి బాధ్యత.. అనే నినదాన్ని ఇటీవల బలంగా వినిపిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్, వ్యక్తిగత హోదాలో తన వెంట తన కుమారుడు అఖిరానందన్ అలాగే స్నేహితుడు ఆనంద్ సాయిని.. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల సందర్శన నిమిత్తం తీసుకెళ్ళారు.
ఆయా ఆలయాల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేరళలోని దేవాలయాల్లోనూ అలాగే తమిళనాడులోని దేవాలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్ కళ్యాణ్‌కి అక్కడి స్థానిక అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది.
అలాగే, స్థానికంగా హిందూ ధర్మ పరిరక్షణపై అవగాహన పెంచుకున్న కొందరు యువకులు, పెద్దవారు, మహిళలు.. పవన్ కళ్యాణ్‌కి ఘన స్వాగతం పలకడమే కాదు, శాలువాలు కప్పి సన్మానించారు.
నిజానికి, పవన్ కళ్యాణ్‌కి భక్తి భావం మొదటి నుంచీ వుంది. రాజకీయాల్లోకి రాక ముందు నుంచీ పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్షతోపాటు పలు దీక్షల్ని చేపడుతూ వచ్చేవారు. రాజకీయాల్లోనూ అదే అలవాటుని, భక్తి భావాన్ని పవన్ కళ్యాణ్ కొనసాగిస్తూ వస్తున్నారు.
నాలుగైదేళ్ళ క్రితమే, ఆయా పుణ్యక్షేత్రాల్ని సందర్శించాల్సి వుందనీ, అప్పట్లో వీలుకాలేదనీ, ఇప్పుడు కాస్త వీలు చూసుకుని.. దేవాలయాల సందర్శనార్థం వచ్చానని పవన్ కళ్యాణ్, తమిళ, కేరళ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
ఈ పర్యటనల్లోనే తిరుపతి లడ్డూ వ్యవహారంపై మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి. ‘సిట్’ విచారణ జరుగుతోందనీ, నిందితుల అరెస్ట్ కూడా జరిగిందని పవన్ కళ్యాణ్ బదులిచ్చారు.
తమ హయాంలో దేవాలయాల పవిత్రత దెబ్బ తినకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. కేరళలో కొచ్చి సమీపంలోని అగస్త్య మహర్షి ఆలయాన్నీ, తిరువళ్ళంలోని పరశురామర్ దేవాలయాన్నీ సందర్శించారు పవన్ కళ్యాణ్. తమిళనాడులోని తంజావూరు సమీపంలోని స్వామినాథ స్వామి (కుమారస్వామి) దేవాలయాన్నీ, తిరుచందూర్ బాలమురుగన్ దేవాలయాన్నీ, కుంభకోణంలో కుంభేశ్వర్ దేవాలయాన్నీ, పళనిలోని దండాయుధపాణి క్షేత్రాన్నీ, తిరుపడంకుండ్రంలో మురుగన్ దేవాలయాన్నీ, మధురైలోని మీనాక్షి దేవాలయాన్నీ, పాలముదిరచోలైలోని సోలమలై మురుగన్ దేవాలయాన్నీ.. మరికొన్ని ముఖ్యమైన దేవాలయాల్నీ సందర్శించారు పవన్ కళ్యాణ్.
షష్ట షన్ముగ దేవాలయాల సందర్శనలో భాగంగా ఆయా దేవాలయాల్ని సందర్శించి, ప్రత్యేక పూజల్ని కుమారుడు అకిరా నందన్‌తో కలిసి నిర్వహించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్, పైన పేర్కొన్న దేవాలయాల సందర్శన సమయంలోనూ స్వల్పంగా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు ఆరోగ్యం పరంగా. అయినాగానీ, గతంలోనే నిర్వహించాల్సిన ఈ దేవాలయాల సందర్శనను ఇంకోసారి వాయిదా వేసే ఉద్దేశ్యం లేక.. అనారోగ్య సమస్యలతోనే, ఆధ్మాత్మిక యాత్రను పూర్తి చేశారు.
కాగా, తమిళనాడులో స్థానిక ప్రజల నుంచి ‘సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్’ అంటూ నినాదాలు పవన్ కళ్యాణ్ యెదుట వినిపించాయి. తమిళంలో పవన్ కళ్యాణ్, తనను కలిసేందుకు వచ్చిన తమిళనాడు వాసులతో ముచ్చటించారు.
అదే సమయంలో, పవన్ కళ్యాణ్ ఆధ్మాత్మిక యాత్రను తమిళ మీడియా ప్రత్యేకంగా కవర్ చేయడం గమనార్హం.