రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గ్రామం వర్తనపల్లిలో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణానికి మార్గం సుగమమైంది. గ్రామస్తుల విన్నపాన్ని వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్, టీటీడీ సహకారంతో ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించగా, ఇప్పుడు ఆ ఆలయ పునర్నిర్మాణానికి రూ.55 లక్షల నిధులు మంజూరయ్యాయి.
మార్చి 14న పాడేరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా వర్తనపల్లి గ్రామాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్, అక్కడి రోడ్లు, డ్రెయిన్లు పరిశీలిస్తున్న సమయంలో స్థానికులు శివాలయాన్ని దర్శించాలంటూ కోరారు. భక్తుల అభ్యర్థన మేరకు ఆలయానికి వెళ్లిన ఆయన, మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఆ శివాలయం తీవ్ర శిథిలావస్థకు చేరడాన్ని గమనించారు. ఆలయాన్ని పునర్నిర్మించాలని గ్రామస్తులు కోరగా, టీటీడీ సహకారంతో అవసరమైన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
పర్యటన ముగిసిన వెంటనే వర్తనపల్లి శివాలయం పునరుద్ధరణ కోసం Tirumala Tirupati Devasthanamsకు ప్రత్యేక లేఖ రాశారు. ఆ ప్రాంత భక్తుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ లేఖకు స్పందించిన టీటీడీ పాలక మండలి వెంటనే సాంకేతిక బృందాన్ని గ్రామానికి పంపింది.
స్థానికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని శివాలయం పునర్నిర్మాణంతో పాటు అమ్మవారి ఆలయం, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాల ప్రతిష్ఠాపనకు కూడా ప్రణాళికలు రూపొందించారు. సింహవాహనంతో అమ్మవారు, మూషికవాహనంతో గణపతి, నెమలి వాహనంతో సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ధ్వజస్తంభం నిర్మాణం కూడా చేపట్టనున్నారు.
ఇవే కాకుండా భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆలయ ప్రాంగణంలో బెంచీలు, బోర్‌వెల్‌తో తాగునీటి సౌకర్యం, మైక్ సిస్టమ్ తదితర ఏర్పాట్లు కూడా చేయాలని టీటీడీ నిర్ణయించింది.
ఈ ఆలయ పునర్నిర్మాణానికి సహకరించిన ముఖ్యమంత్రి N. Chandrababu Naiduకు, టీటీడీ పాలక మండలి ఛైర్మన్ B. R. Naiduకు, పాలక మండలి సభ్యులకు, అధికారులకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
