ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఏ అధికారిని బెదిరించినా సరే సుమోటోగా తీసుకుని కేసులు పెడుతామంటూ హెచ్చరించారు. ఇప్పుడు కొందరు కావాలని ఐఏఎస్ అధికారులను బెదిరిస్తున్నారని.. మాది మంచి ప్రభుత్వమే గానీ మెతక ప్రభుత్వం కాదంటూ తెలిపారు. గుంటూరులో అటవీ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పవన్ ముఖ్య అతిథిగా హాజరై నివాళి అర్పించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ మరోసారి వైసీపీ మీద నిప్పులు చెరిగారు.
వైసీపీ ప్రభుత్వంలో అధికారులను ఇష్టం వచ్చినట్టు వాడేసుకున్నారు. ఎప్పటికీ తామే అధికారంలో ఉంటామనుకుని అలా ప్రవర్తించారు. ఇప్పుడు తాము తప్పులను వెలికి తీస్తుంటే అధికారులను బెదిరిస్తున్నారంటూ మండిపడ్డారు. అధికారులను ఒక్క మాట అన్నా సరే సుమోటోగా తీసుకుని కేసులు పెడుతామంటూ హెచ్చరించారు. ఆడపిల్లల రక్షణ విషయంలో తాము చాలా కఠినంగా ఉంటామని.. ఎవరికి ఆదప వచ్చినా ఊరుకోబోమన్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు కూడా భద్రత కల్పిస్తామంటూ వివరించారు.
సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడితే అరెస్టులు చేయాలంటూ పోలీసులకు సూచించారు. ఇప్పటి వరకు ఉన్న సిస్టమ్ వేరే అని.. ఇకపై ఉండే సిస్టమ్ వేరేలా ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.