ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ మీద ఫైర్ అయ్యారు. తాజాగా ఆయన పల్నాడు జిల్లా మాచవరం మండలం, పల్నాయపాలెం, మేమవరంలో సరస్వతి పవర్ ప్లాంట్ కు సంబంధించిన భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ మీద తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ ఫ్యామిలీ ప్రజల ఆస్తుల్ని లాక్కుని తమ సొంత ఆస్తుల్లాగా భావిస్తున్నారు. పైగా అది తమ ఆస్తి అన్నట్టు కొట్టుకుంటున్నారంటూ సెటైర్లు వేశారు. అసలు సరస్వతి పవర్ కంపెనీకి ఇన్ని భూములు ఎందుకిచ్చారని ప్రశ్నించారు.
వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు సరస్వతి కంపెనీ కోసం ఇష్టానుసారంగా భూములు తీసుకున్నారు. ఆ లీజును అప్పుడు 30 ఏళ్ల వరకు తీసుకున్నారు. కానీ జగన్ వచ్చిన తర్వాత దాన్ని ఏకంగా 50 ఏళ్లకు పెంచుకున్నారు. ఇక్కడ కంపెనీ పెట్టి ఉద్యోగాలు ఇస్తాం, నష్టపరిహారం ఇస్తాం అని రైతులను బెదిరించి భూములు లాక్కున్నారు. కానీ ఇంకా ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఈ సరస్వతి కంపెనీ కోసం రైతుల నుంచి 350 ఎకరాలు తీసుకున్నారు. ఇంకో చోట ముడిసరుకు కోసం 1100 ఎకరాలు తీసుకున్నారు.
అటవీ భూములు కూడా 400 ఎకరాల దాకా వాటిని రెవెన్యూ భూమలుగా మార్చి వాడేసుకున్నారని తెలుస్తోంది. దీని మీద పూర్తి విచారణ జరిపిస్తాం. ఇందులో జరిగిన అవకతవకలను బయట పెట్టి ప్రజలకు నిజాలను వివరిస్తాం అంటూ పవన్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.